Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫిబ్రవరి 25 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్‌ పరీక్షలు

- Advertisement -

– మార్చి 18 వరకు నిర్వహణ
– వచ్చే విద్యాసంవత్సరం నుంచి 80 మార్కులకే పరీక్షలు..ఏసీఈ కొత్త గ్రూపు
– ఇంటర్నల్స్‌కు 20 మార్కులు
– సిలబస్‌లో సమూల మార్పులు
– ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. థియరీ పరీక్షలు 80 మార్కులకే జరగనున్నాయి. ఇంటర్నల్స్‌కు 20 మార్కులుంటాయి. ఈ నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి అమల్లోకి రానుంది. శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయనీ, మార్చి 18 వరకు జరుగుతాయని వివరించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్‌లో కొత్తగా అకౌంటెన్సీ, కామర్స్‌, ఎకనామిక్స్‌ (ఏసీఈ) గ్రూపును ప్రవేశపెట్టబోతున్నామని వివరించారు. ఈ నిర్ణయాలు కూడా వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇంటర్‌ థియరీ పరీక్షలను 80 మార్యులకే నిర్వహిస్తామని అన్నారు. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్స్‌ నిర్వహిస్తామన్నారు. సబ్జెక్టులతోపాటు లాంగ్వేజెస్‌ కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటి వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలుంటాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమలు చేసిన 30 మార్కులను ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 15 మార్కులకు, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వంటి సబ్జెక్టులకు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇంగ్లీష్‌ మాత్రమే అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంస్కృతం, తెలుగు ఇతర ఆర్ట్స్‌, కామర్స్‌ అన్ని సబ్జెక్టులకూ ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎంఈసీ గ్రూప్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా గణితం ప్రశ్నాషత్రాన్ని రూపొందించాలని నిర్ణయించామని చెప్పారు. భవిష్యత్‌లో విద్యార్థులకు మేలు కలిగేలా 12 ఏండ్ల తర్వాత ఇంటర్‌ సిలబస్‌ను మారుస్తున్నామని అన్నారు. ఎన్‌సీఈఆర్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులుంటాయని చెప్పారు. సిలబస్‌ మార్పులకు సంబంధించిన నబ్జెక్టు నిపుణులతో వచ్చేనెల ఒకటి నుంచి డిసెంబర్‌ 15 వరకు 45 రోజులపాటు కసరత్తు చేస్తామని వివరించారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా నివేదికను రూపొందించనున్నట్టు చెప్పారు. కొత్త సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణను ఏప్రిల్‌ నెలాఖరు నాటికి లేదా మే మొదటి వారంలోగా పూర్తి చేసి విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం రోజే అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సిలబస్‌ను రూపొందించడంతోపాటు పాఠ్యపుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తామని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో డిజిటలైజ్‌ చేస్తున్నామని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్‌ విధానం అమలుపై పరిశీలిస్తామన్నారు. టీస్టెమ్‌ ద్వారా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రయివేటు పాలిటెక్నిక్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీల్లోని ల్యాబ్‌లను వాడుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 14 మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ ఉన్న ప్రయివేటు జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదనీ, అందులో మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (సీవోఈ) జయప్రద బాయి, జాయింట్‌ సెక్రెటరీలు భీం సింగ్‌, జ్యోత్స్న రాణి, వసుంధర, రమణకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -