రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-గోదావరిఖని
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం తీసుకొచ్చిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని, రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌తో కలిసి జాన్‌వెస్లీ శనివారం ఆసిఫాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆగారు. వారికి పార్టీ జిల్లా నాయకత్వం స్వాగతం పలికింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కులగణన చేసి, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, ఆర్డినెన్స్, జీవో తీసుకొచ్చినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకొని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున గెలిచిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేసి అమలు చేయించాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకొని ఐక్యఉద్యమాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని, దానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.
రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు సంవత్సరాలైనా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి దాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రకటించి, వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదలు ఇండ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు చేసి గుడిసెలు వేసుకొని ఉన్నారని, వాళ్లందరికీ పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఆ హామీలు అమలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వారి వెంట సీపీఐ(ఎం) పెద్దపల్లి కార్యదర్శి వై.యాకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు ఎ.మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు టి.రాజారెడ్డి, ఎన్.బిక్షపతి, సిహెచ్.శైలజ, గీట్ల లక్ష్మారెడ్డి ఉన్నారు.
రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



