Sunday, October 26, 2025
E-PAPER
Homeసోపతిఅమ్మ ప్రేమను తెలిపిన పాట

అమ్మ ప్రేమను తెలిపిన పాట

- Advertisement -

అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గురించి చెప్పడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. ఎన్ని కావ్యాలైనా సరిపోవు. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా, తనను అందరూ దూరంగా వదిలేసి వెళ్ళిపోయినా తాను మాత్రం తన పిల్లలే జీవితమంటూ బతుకుతుంటుంది. తన సంతోషాలను, ఇష్టాలను అన్నింటినీ వదిలేసి తన పిల్లల సంతోషం కోసం బతుకుతుంటుంది. అలాంటి త్యాగమూర్తి అయిన అమ్మను గురించి, అమ్మ ప్రేమను గురించి ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశాడు లక్ష్మీ భూపాల్‌. 2023 లో బి.వి. నందినిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.

అమ్మ ప్రేమ మధురమైనది. అమ్మ మనసు మార్దవమైనది. మనమెంత కష్టపెట్టినా దాన్ని ఇష్టంగానే భావిస్తుంది అమ్మ. లోన ఎంత బాధ ఉన్నా అది పైకి కనబడనివ్వకుండా తనలో తానే కుమిలిపోతుంటుంది. అలాంటి అమ్మ గురించి చెబుతూ కరుణరసభరితంగా ఈ పాట రాశాడు లక్ష్మీ భూపాల్‌. వింటూ ఉంటే హదయం, కళ్ళు రెండూ చెమ్మగిలిపోతాయి. చిన్నతనంలోనే తండ్రికి దూరమైన ఓ అమ్మాయి..తల్లి లాలనలోనే, పాలనలోనే పెరుగుతుంది. ఆ తల్లి తన బిడ్డను ఎంతో అపురూపంగా, అల్లారు ముద్దుగా పెంచుతుంది. తనకు ఎంత కష్టం కలిగినా తన కూతురుకి ఆవగింజంత కష్టం కూడా కలగనివ్వదు. చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలతో తన తల్లిని హింసించినా, సముద్రం బడబాగ్నిని కడుపున దాచుకున్నట్టుగా తనలోనే ఆ బాధను దాచుకుంటుంది.

అలా..పెరిగి పెరిగి పెద్దదై మంచి స్థాయికి చేరుకుంటుంది ఆ అమ్మాయి. ఓ ప్రోగ్రాంలో తన తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి ఇలా పాట రూపంలో చెబుతోంది. ఇదీ ఇక్కడ సందర్భం. ఆకాశంలోన ఒకే మేఘం ఉంది. అది ఏకాకిగా ఉంది. దాని బాధయే కన్నీరుగా కురిసింది. ఆ కన్నీరే వానగా భూమి మీద పడింది. అంటూ తన జీవితాన్నే పాటగా చెబుతుంటుంది. ఇక్కడ ఆమె సమాజం అనే ఆకాశం గురించి చెబుతోంది. ఏకాకి మేఘంలా తను ఒంటరిగా సంచరిస్తున్నానని అంటోంది. మేఘం తన జీవితం..వాన తన కన్నీరు.. వీథిలోన ఆకలితో చనుబాలకోసం ఎదను చూడకు ఓ నాన్నా అంటూ తన గతకాలపు గాథను తలచుకుంటోంది. తన తల్లి జీవితాన్ని, తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటోంది. తల్లి పేగు తనకు తోడైందని, ఆమె కొంగే నీడైందని చెబుతోంది. అరచేతుల్లో ఉన్న తన అదష్టాన్ని ఎవరు చెరిపారు. తన జీవితం ఒంటరిమయమై ఇలా ఎందుకు మిగిలిపోయింది అని కుమిలిపోతోంది.

ఇక్కడ..అరచేతుల్లో ఉన్న తన జీవితాన్ని గురించి చెప్పడానికి…అరచేతుల్లో తలరాత అనే ప్రయోగం చేశాడు లక్ష్మీ భూపాల్‌. అది ఎంతో గొప్ప భావవ్యక్తీకరణ.. ఆనాడు తను పొందిన కష్టాలన్నీ, తనకు తగిలిన గాయాలన్నీ నేడు శాపాలుగా మిగిలాయి. అవి తన ఎదఫలకంపై నిలుచున్నాయి. ఆ జ్ఞాపకాలు కళ్ళముందు అలా కదులుతుంటే తన తల్లి ఆనాడు అన్ని కష్టాలను దిగమింగుకుంటూ ఎలా జోల పాడిందో, ఎలా నిద్రపుచ్చిందో అర్థం కావడం లేదని చెబుతోంది ఆమె. ఇప్పుడు తన తల్లి తన దగ్గర లేదు. అయినా తను ఒంటరినన్న బాధ లేదు. ఒంటరిగా ఉన్నా తాను ఓడిపోనట్టే. తన బాధ తనకు తోడుగా ఉందని చెబుతోంది. తన కళ్ళల్లో ఉన్న కన్నీరు తనకు జంటగా తోడుగా ఉందని చెబుతోంది. ఆ కన్నీటికి కారణం..తన చిన్ననాటి జ్ఞాపకాలే..తన కోసం తన తల్లిపడిన తపననే.

చుట్టూ ఎంతగా చీకటి ఉన్నా, బాధల చీకటీ ఉన్నా తన తల్లి మాత్రం తన బిడ్డ బోసి నవ్వుల్ని చూసుకొని మురిసిపోతుందట. ఆ బోసి నవ్వుల్లో బిడ్డ ముఖం చంద్రబింబంలా వెలుగుతూ ఉంటే, వెన్నెలలు వెదజల్లుతూ ఉంటే..ఇక చుట్టూ ఉన్న చీకటి ఏం చేస్తుంది..అనే లోతైన సందేశాన్ని ఈ పంక్తుల్లో చెప్పాడు కవి. అంటే..తల్లికి ఎన్ని కష్టాలున్నా బిడ్డ నవ్వుల వెలుగుల్ని చూసి అవన్నీ మరిచిపోతుందని చెప్పకనే చెప్పాడు. బాధలు పడుతున్నప్పుడు బాధలు తీర్చేవాళ్ళు ఉండకపోయినా కనీసం ఓదార్చేవాళ్ళున్నా ఊరటగా ఉంటుంది. కనీసం ఓదార్చేవాళ్ళు కూడా లేనప్పుడు జీవితం నరకంలా అనిపిస్తుంది. అలా పసిబిడ్డగా తానున్నప్పుడు..బాధల్లో వాళ్ళమ్మ ఒడే తనకు నీడగా, ఓదార్పుగా ఉందట..ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ చెబుతోంది ఆ అమ్మాయి.

ఇప్పటికీ తను ఒంటరితనాన్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నానన్న విషయాన్ని కూడా ఈ పాటలో స్పష్టం చేస్తోంది. చివరి పంక్తుల్లో..హదయం ద్రవించే విషయాన్ని గొప్ప భావంలో చెప్పాడు లక్ష్మీ భూపాల్‌.. కుశలమడిగే మనిషి కూడా లేని తన జీవితంలో అసలు తాను బతికి ఉన్నానా? తాను ఊపిరితో ఉన్నానా? అని సందేహంతో ఉన్న సమయంలో చలి వల్ల కలిగిన వణుకుతో బతికి ఉన్నానన్న సత్యాన్ని స్పష్టం చేసుకున్నదట. గుండె చెరువయ్యేంత కరుణరసావిష్కృతంగా ఈ పాటను రాశాడు లక్ష్మీ భూపాల్‌. ఇది సినిమా కోసం రాసిన పాటే అయినా నేటికీ ఇలాంటి జీవితాలు మనకు అడుగు అడుగునా కనబడుతుంటాయి.

పాట:
ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన/నడి వీధిలోన చనుబాల కోసం/ఎదచూడకు నాన్న/తన పేగే తన తోడై తన కొంగే నీడై/అరచేతి తలరాత ఎవరు చెరిపారో/ఆనాటీ గాయాలే ఈనాడే శాపాలై/ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నా కన్నా/ఒంటరై ఉన్న ఓడిపోలేదు/జంటగా ఉంటె కన్నీరే కళ్ళలో/చీకటెంతున్నా వెలుగే కన్నా/బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే/పడే బాధల్లో ఒడే ఓదార్పు/కుశలమడిగె మనిషిలేక ఊపిరుందో లేదో/చలికి వణికి తెలుసుకున్న బ్రతికి ఉన్నాలే.

డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -