విక్రయానికి గుదిబండగా మారిన స్లాట్ బుకింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత పత్తి సంస్థ (సీసీఐ) కొత్త నిబంధనలతో పత్తి రైతులకు కొత్త కష్టాలు ఆరంభమయ్యాయి.పత్తి కొనుగోలులో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పత్తి రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇకపై పత్తి అమ్మకాలకు ‘కపాస్ కిసాన్’ యాప్ లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది స్మార్ట్ ఫోన్ లేని, చదువు రాని వృద్ధ రైతులకు తలనొప్పిగా మారింది. యాప్ వాడకం, వివరాల నమోదుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. మండల వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా….ఈ యాప్ పై రైతులు ఆవేదన వ్యక్తపరున్నారు. మండలంలో మొత్తం 4,800 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 4 వేల టన్నుల పత్తి పంట వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
8 శాతానికి మించితే..
రైతులు తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉన్న పత్తిని తీసుకురావాల్సి ఉంటుంది. అత్యధికంగా 8 శాతం తేమ ఉంటే రూ.8,110 మద్దతు ధర లభిస్తుంది. అంతకు మించి పెరిగే ఒక్కొక్క శాతానికి రూ.81 ధర తగ్గుతుంది. తేమ శాతం 9 ఉంటే రూ.7,929 నుంచి రూ.7,866, 12 శాతం ఉంటే రూ.7,689 నుంచి రూ.7,785 మద్దతు ధరగా నిర్ధారించారు. అంత కంటే ఎక్కువ తేమ శాతం ఉంటే పత్తి ప్రయివేట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
వినియోగం ఇలా..
కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి విక్రయానికి ముందు. రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను ఆయా ప్రాంత వ్యవసాయ విస్తరణాధి కారులు (ఏఈఓ) వద్ద నమోదు చేసుకోవాలి. పంట వివరాలను నమోదు చేసుకునే సమయంలో ఓటీపీ కోసం ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ నంబర్ తప్పుగా నమోదై ఉంటే దానిని ఏఈఓతో సరిచేయించుకోవాలి. స్మార్ట్ఫోన్ లోని ప్లేస్టోర్లో కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి.ఈ యాప్ ద్వారానే రైతులు తాము ఏ రోజు పత్తిని విక్రయించాలను కుంటున్నారో మాతృ భాషలో స్లాట్ బుక్ చేసుకోవాలి. పత్తిని విక్రయించే మార్కెట్ లేదా మిల్లు ఎంపిక చేయాలి.విక్రయించే పత్తి పరిమాణాన్ని క్వింటాళ్లలో నమోదు చేయాల్సి ఉంటుంది.



