సీనియర్ జర్నలిస్టులకు రూ10.వేలు పింఛన్ ఇవ్వాలి
జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, తాటికొండ కృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, తాటికొండ కృష్ణ లు అన్నారు. జిల్లా కమిటీ సమావేశం ఆదివారం అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించి రూ.40 కోట్లు కేటాయించారని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
కార్పొరేటు ఆసుపత్రులలో జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని, సమాచార పౌర సంబంధాల శాఖ రికార్డులను పరిశీలించి పత్రికా రంగంలో 20 ఏళ్లు పనిచేసిన సీనియర్ జర్నలిస్టులకు ప్రతినెలా రూ.10వేలు రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో, అనారోగ్యంతో చనిపోయిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఆర్థిక సాయం చేసి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం (బస్సు పాసులు ) అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేకపోతుందన్నారు. జర్నలిస్టుల సమస్యలను, సంక్షేమాలను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విస్మరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని, డిమాండ్ చేశారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు జర్నలిస్టులకు ఇంటి స్థలాలను ఇస్తామని ఆశ కల్పించి విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా బాగా విస్తరించింది. జర్నలిస్టులు తమ విలువలు కాపాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో తెలంగాణ వర్కింగ్ జనరల్ ఫెడరేషన్ సభ్యత్వాలు పూర్తిచేసుకుని జిల్లా మహాసభలు నిర్వహించుకోవాలని సూచించారు. ఫెడరేషన్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన నిరంతరం పోరాడుతుంది అన్నారు. జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్షులు రామచంద్రం, ప్రధాన కార్యదర్శి కాలూరి శ్రీను, జాతీయ కౌన్సిల్ సభ్యులు దుమర్ల భాస్కర్, సీనియర్ జర్నలిస్టు బాలకృష్ణ, స్థానిక విలేకరులు శ్రీశైలం, కళ్యాణ్, శ్రీను మల్లికార్జున్,రవికాంత్ లక్ష్మణ్, విష్ణు, నాగరాజు రవికుమార్ తదితరులు ఉన్నారు.



