Monday, October 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌

కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌

- Advertisement -

విద్యుత్‌ సవరణ చట్టం-2025 లక్ష్యం అదే
నవంబర్‌ 8..అభ్యంతరాలకు తుదిగడువు
ప్రాంతాల వారీగా ప్రయివేటు డిస్కంల ఏర్పాటుకు గ్రీన్‌సిగల్‌
ఐదేండ్లలో క్రాస్‌ సబ్సిడీ ఎత్తేయాలని ప్రతిపాదనలు
‘ఉచితాలు’ మరింత ప్రియం
ఉత్సవ విగ్రహాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు
‘పవర్‌’ మొత్తం కేంద్రం చేతుల్లోకే…
‘పునరుత్పాదకం’లో ప్రయివేటుదే ఆధిపత్యం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని విద్యుత్‌ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశ ప్రజల తీవ్ర వ్యతిరేకతల మధ్య 2003లో నూతన విద్యుత్‌ చట్టం అమల్లోకి వచ్చింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 2014 నుంచే ఈ చట్టానికి సవరణలు చేసి, ‘పవర్‌’ మొత్తం ప్రయివేటుకు కట్టబెట్టాలని ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగు లు ఐక్యంగా ఆందోళనలు చేపట్టి, మోడీ సర్కార్‌కు ముచ్చెమటలు పట్టించారు.

ఐదుసార్లు ఫెయిల్‌…
2014లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో పోటీ తీసుకురావడం, ఓపెన్‌ యాక్సెస్‌ విధానాన్ని విస్త్రుత పర్చడం, పునరుత్పాదక ఇంధన వృద్ధి లక్ష్యాలను సాధిస్తామంటూ విద్యుత్‌ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 2018లో ప్రజాభిప్రాయం కోసం ముసాయిదా విడుదల చేశారు. చట్టంగా మారలేదు. 2020లో ముసాయిదా దశలోనే నిలిచిపోయింది. 2021లో రాష్ట్రాల వ్యతిరేకతతో పెండింగ్‌లో ఉండిపోయింది. 2022లో మోడీ ప్రభుత్వం ఈ సవరణల బిల్లును మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలన కోసం పంపారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డ్రాఫ్ట్‌ బిల్లుపై ప్రజాభిప్రాయాలు చెప్పాలంటూ ఈనెల 9న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నవంబర్‌ 8వ తేదీ లోపు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన www.dewa@nic.in మెయిల్‌కు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలపాలని కోరింది. దేశ విద్యుత్‌ రంగాన్ని యావత్తూ ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వ ం చేస్తున్న ప్రయత్నాలను విద్యుత్‌ ఉద్యోగులు ఐక్యంగా తిప్పికొడుతున్నారు. ఇప్పుడు కేంద్రం తెచ్చిన 2025 సవరణ ప్రతిపాదనల్ని వారితో పాటు దేశ ప్రజలు కూడా తిరస్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ అభ్యంతరాలను కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు పంపి, తమ నిరసనను తెలపాలని విద్యు త్‌రంగ నిపుణులు చెప్తున్నారు.

ప్రయివేట్‌ కంపెనీల ఆధిపత్యం
విద్యుత్‌ సవరణ బిల్లులో ప్రధానంగా పేర్కొన్న అంశం ఒకే ప్రాంతంలో పలు పంపిణీ సంస్థలకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనివల్ల పోటీని ప్రోత్సహిస్తే, యూనిట్‌ చార్జీలు తగ్గుతాయని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ప్రయివేటు సంస్థలు లాభాలు వచ్చే ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతాయి. గ్రామీణ భారం మళ్లీ ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ సంస్థలపైనే పడుతుంది. దీనికి ఆర్టీసీనే ప్రత్యక్ష ఉదాహరణ. బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నం, ముంబయి వంటి రద్దీ ఉండే రూట్లలో ప్రయివేటు బస్సులు తిరుగుతున్నాయే తప్ప, ఆయా రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాలకు బస్సులు తిప్పిన దాఖలాలే లేవు. ఇప్పుడు విద్యుత్‌ రంగంలోకి ప్రయివేటు సంస్థలు వస్తే, పరిస్థితులు ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండవనేది విద్యుత్‌రంగ నిపుణుల అభిప్రాయం.

అలంకారప్రాయంగా ఈఆర్సీలు
ఇప్పటి వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్‌ నియంత్రణ మండళ్లు(ఈఆర్సీ) ఉన్నాయి. విద్యుత్‌ టారిఫ్‌లు, లైసెన్సుల మంజూరు సహా ఇతర నిర్ణయాలన్నీ ఈఆర్సీలే నిర్వహిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సవరణలతో ఈఆర్సీల అధికారాలు పరిమితం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆయా కమిషన్ల ఉత్తర్వులు ఉండాలి. ఫలితంగా ఈఆర్సీలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారతాయి. కేంద్రం చేస్తున్న విద్యుత్‌ చట్టాలను తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుం టున్నాయి. కేంద్రం సూచించిన సవరణలతో రాష్ట్రాలు ఆ అవకాశాలన్నింటినీ కోల్పోతాయి.

పునరుత్పాదకం పేరుతో ప్రయివేటుకు
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ తరహా పునరుత్పాదకం యావత్తూ ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలే నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వరంగంలో ఇప్పటి వరకు ‘పునరుత్పాదకం’ లేదు. తెలంగాణలో 23 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని మొత్తం ప్రయివేటులో తెస్తున్నారే తప్ప, ప్రభుత్వ వాటా ఏమాత్రం లేదు. ఫలితంగా క్రమేణా విద్యుదుత్పత్తి బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లులో ఇదో కీలకమైన అంశం.

వినియోగదారులపై భారాలు
ఈ సవరణ బిల్లు చట్టరూపంలో అమల్లోకి వస్తే తొలి భారం సామాన్య విద్యుత్‌ వినియోగదారులపైనే పడుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వ్యవసాయంతో పాటు 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ అమల్లో ఉంది. కుల వృత్తిదారులైన నాయీ బ్రాహ్మణులు (హెయిర్‌కటింగ్‌ సెలూన్లు), రజకులతో పాటు మరికొన్ని కేటగిరిల వినియోగదారులకు సబ్సిడీ కరెంటును ఇస్తున్నారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చి, ప్రయివేటు డిస్కంలు ఏర్పాటైతే, ఉచితాలకు చెల్లుచీటి తప్పదు. ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించిన కాస్ట్‌ రిఫ్లెక్టివ్‌ టారిఫ్‌ విధానం ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తి, రవాణా, పంపిణీకి అయ్యే మొత్తం ఖర్చును వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. దానికి తోడు కరెంటు యూనిట్‌ రేట్లు కూడా పెరుగుతాయి.

బిల్లు అమల్లోకి వస్తే..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం-2025 అమల్లోకి వస్తే ప్రధానంగా రాష్ట్రాలు విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీల్లో తమ హక్కుల్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వరంగంలోని జెన్‌కోలు బ్యాకింగ్‌డౌన్‌ అవుతాయి. ట్రాన్స్‌కో లైన్లు ఓపెన్‌ యాక్సెస్‌ పేరుతో అద్దెకు ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితికి నెట్టబడతాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నామమాత్రంగా మిగులుతాయి. ప్రభుత్వ డిస్కంలకు పోటీగా ప్రయివేటు డిస్కంలు పుట్టుకొస్తాయి. వాటికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ ప్రభుత్వ డిస్కంల నుంచే పొందుతాయి. ఇప్పటికే దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయివేటు డిస్కంల ఏర్పాటు కోసం కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. మేఘాలయ, మణిపూర్‌, సిక్కిం, లక్షద్వీప్‌ వంటి పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉద్యోగుల ప్రతిఘటనలతో ఇవి తాత్కాలికంగా నిలిచిఉన్నాయి.

అదానీ రంగప్రవేశం
కేంద్ర ప్రతిపాదించిన సవరణల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇప్పటికే స్మార్ట్‌ మీటర్ల పేరుతో రాష్ట్రాల వారీగా మొత్తం విద్యుత్‌రంగాన్ని ‘అదానీ’ కంపెనీలకు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లోని లఢక్‌లో దాదాపు 52వేల ఎకరాల భూమిని అదానీ సోలార్‌ విద్యుదుత్పత్తి కోసం కేటాయించారు. అలాగే పునరుత్పాదకం పేరుతో అనేక రాష్ట్రాల్లో అదానీ కంపెనీ హవా కొనసాగిస్తోంది. తెలంగాణలో కూడా అదానీ సంస్థతో దావోస్‌ వాణిజ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో ఒకరూపంలో ‘అదానీ’ రాష్ట్రంలోకి చొరబడటం ఖాయం. మోడీ మార్కు పాలనా…మజాకా!!

త్రిశంకు స్వర్గంలో వినియోగదారుల హక్కులు
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వినియోగదారుల రక్షణ కోసం ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడతాయి. వినియోగదారుల ఫిర్యాదులు, సేవల నాణ్యతను ప్రశ్నించే అధికారాన్ని కోల్పోతారు. ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థల అజమాయిషీ పెరగడంతో వారికి రక్షణ కల్పించడం కోసం, వినియోగదారుల రక్షణ చట్టాల పరిధిని కుదించారు. కన్సూమర్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ ఫోరమ్స్‌ అనేవి అన్ని డిస్కంల పరిధిలోనూ ఉన్నాయి. కొత్త చట్టం వస్తే ఇవన్నీ రద్దు కావడమో లేక బలహీనపడటమో జరుగుతాయి.

క్రాస్‌ సబ్సిడీకి మంగళం
ప్రస్తుతం రాష్ట్రంలో క్రాస్‌ సబ్సిడీ అమల్లో ఉంది. దీన్ని వచ్చే ఐందేండ్లలో ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత బిల్లులో పేర్కొంది. ప్రస్తుతం పరిశ్రమలకు అధిక టారిఫ్‌ విధించి, ఆ వచ్చే ఆదాయాన్ని రైతులు, పేద వినియోగదారులకు సబ్సిడీ ద్వారా కరెంటును అందిస్తున్నారు. దీన్నే క్రాస్‌ సబ్సిడీ అంటారు. ఈ విధానాన్ని ఏత్తేయాలని కేంద్రం బిల్లులో ప్రతిపాదించింది. పారిశ్రామిక వర్గాలు కూడా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని ఎత్తేస్తే, పరిశ్రమలకు తక్కువ ధరకు కరెంటు లభిస్తుందనేది పారిశ్రామికవర్గాల వాదన. అదే సందర్భంలో క్యాప్టివ్‌ పవర్‌, ఓపెన్‌ యాక్సెస్‌ వంటి అవకాశాలను ఈ బిల్లు మరింత సులభతరం చేస్తుంది. ఫలితంగా సంపన్నులకు తక్కువ ధరకు, సామాన్యులకు ఖరీదైన విద్యుత్‌ అందుబాటులోకి వస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -