Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనవంబర్‌ 1లోపు డిమాండ్లు నెరవేర్చకుంటే 3 నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌

నవంబర్‌ 1లోపు డిమాండ్లు నెరవేర్చకుంటే 3 నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌

- Advertisement -

ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇనిస్టిట్యూషన్స్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నవంబర్‌ 1లోపు డిమాండ్లు నెరవేర్చకుంటే 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రయివేటు ఉన్నత విద్యా సంస్థల బంద్‌ పాటిస్తామని ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ హెచ్చరించింది. ఆదివారం అత్యవసరంగా ఫెడరేషన్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను దీర్ఘకాలంగా విడుదల చేయకపోవడంతో ప్రయివేటు కాలేజీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల పరిస్థితులను సమీక్షించారు. అనంతరం నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతూ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ఫెడరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌ బాబు, సెక్రెటరీ జనరల్‌ కె.ఎస్‌.రవికుమార్‌, కోశాధికారి కె.కృష్ణారావు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ కె.సునీల్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

దసరా, దీపావళిలోపు విడుదల చేస్తామని హామీ ఇచ్చి బకాయిపడ్డ రూ.900 కోట్లను నవంబర్‌ 1లోపు విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 2024-25 వరకకు పెండింగ్‌ ఉన్న డ్యూస్‌ అన్నింటినీ 2026 మార్చి 31 నాటికి క్లియర్‌ చేసేలా టైంబాండ్‌ రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించాలని కోరారు. ఈ డ్యూస్‌ దాదాపు రూ.9,000 కోట్లు ఉన్నట్టు తెలిపారు. అదే విధంగా 2025-26 విద్యా సంవత్సరం బకాయిలను కూడా 2026 జూన్‌ 30 నాటికి పూర్తిగా చెల్లించేలా రోడ్‌మ్యాప్‌ విడుదల చేయాలని కోరారు. ఏఐసీటీఈ ఆమోదించిన కొత్త కోర్సులకు సంబంధించిన ఎన్‌ఓసీలు పలు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు గుర్తుచేశారు.

కనీసం వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ నాలుగు డిమాండ్లు, రోడ్‌ మ్యాప్‌లతో నవంబర్‌ 1లోపు నెరవేర్చకుంటే 3 నుంచి బంద్‌ తప్పదని హెచ్చరించారు. ఫెడరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌ బాబు మాట్లాడుతూ నవంబర్‌ 10లోపు 2 లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తర్వాత 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా తమ నిరసన కార్యక్రమాలు వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అడిగినప్పుడే ప్రభుత్వ ఎంక్వైరీలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ బకాయిల విషయంలో మంత్రులు తమకు సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -