– చదువు దారికి వచ్చిన గిరిజన బాలికలు: హెచ్ఎం శంకర్
నవతెలంగాణ – బల్మూరు
మండలంలోని మారుమూల గ్రామం చెంచుగుడెం. గ్రామంలోని గిరిజన బాల బాలికల చదువు కోసం 30 ఏండ్ల క్రితమే గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ అయ్యి కొనసాగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శంకర్ తెలిపారు. ఎన్నో సమస్యలను అధిగమించి ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చిందని చదువుకునేందుకు విద్యార్థులు ముందుకు వస్తున్నారని తెలిపారు. బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సమస్యలు వసతుల కల్పనపై ప్రధానోపాధ్యాయునితో ఇంటర్వ్యూ వివరాలు నవతెలంగాణలో..
నవతెలంగాణ: పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య?
హెచ్ఎం: ప్రస్తుత విద్యా సంవత్సరం 184 మంది విద్యార్థినులు ఉన్నారు. పదో తరగతిలో గత విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం నలుగురు విద్యార్థులు అనగా 24 మంది విద్యార్థులు ఉన్నారు. గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యి ఇది మూడో సంవత్సరం. మొదటి రెండు పదవ తరగతి బ్యాచ్ ల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం పదవ తరగతి విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సబ్జెక్టు వారిగా రోజుకు ఒక ఉపాధ్యాయుడు వారి సబ్జెక్టును రిపీట్ చేస్తున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరియు ఐటిడిఏ అధికారుల చొరవతో పెండింగ్ గదుల నిర్మాణానికి ఇతర పనులకు గాను ఈ మధ్యన 24 లక్షల రూపాయలు మంజూరి జరిగింది. పనులు త్వరితగతిన కొనసాగుతున్నాయి. గుడ్లు ఇతర ఆహార సరుకులు జిసిసి ద్వారానే కొనుగోలు చేస్తున్నాం.
నవతెలంగాణ: ఉపాధ్యాయ సిబ్బంది సరిపడా ఉన్నారా?
హెచ్ఎం: రెగ్యులర్ ఉపాధ్యాయులు ఆరుగురున్నారు. సిఆర్టి ఉపాధ్యాయులు నలుగురు ఉన్నారు. ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, హిందీ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థులకు సమస్య రాకుండా ప్రయత్నిస్తున్నాం. రాత్రి సమయంలో లేడీ వాచ్ మెన్, వార్డెన్ అందుబాటులో ఉంటున్నారు. పాఠశాల భద్రత కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేశాము. ప్రతిరోజు ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులే కాక మిగతా వారి పట్ల చదువును ప్రోత్సహిస్తున్నాము. ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ తీసుకొని బోధిస్తున్నాము.
నవతెలంగాణ: క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతారా?
హెచ్ఎం: ఆటల్లో కూడా విద్యార్థినిలు చురుకుగా పాల్గొంటారు. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో పాల్గొన్నారు. కబడ్డీ, ఖో- ఖో గేమ్ లలో డివిజన్ స్థాయికి 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. నవంబర్ లో జరిగే జోనల్ స్థాయి ఆటల్లో పాల్గొంటారు. ట్రైబల్ వెల్ఫేర్ బోర్డు వారు ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో నిత్యం వ్యాయామం, ఆసనాలు చేయిస్తుంటాం. ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తుంటాం.
నీవతెలంగాణ: తాగేందుకు ఫిల్టర్ వాటర్ వాడుతున్నారా.?
హెచ్ఎం: డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే ఈ మధ్య కొంత తీరింది. ప్రస్తుతం ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేస్తున్నాము. కమ్యూనిటీ వాటర్ హైదరాబాద్ సంస్థ వారు స్వచ్ఛందంగా ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేశారు. దీంతో తాగునీటి సమస్య చాలా మటుకు తీరింది. ఫిల్టర్ మిషన్ ఏదైనా సందర్భంలో పాడైనట్లయితే సంబంధిత సంస్థ వారే వచ్చి బాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలకు మినీ ట్రాన్స్ఫార్మర్ నీ ర్పాటు చేస్తే బాగుంటుంది. గ్రామానికి పాఠశాలకు కలిపి ఒకే మినీ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం పట్ల సంబంధిత అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలియజేశాము. విద్యుత్తు సమస్య తీరుతుందని భావిస్తున్నాం.



