మున్సిపల్ కమిషనర్‌ను కోరిన మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్
నవతెలంగాణ – పరకాల
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు సీఎస్ఐ మిషన్ కాంపౌండ్‌లో గల సమాధుల తోటలో నవంబర్ 2వ తేదీన జరగనున్న సమాధుల పండుగను (ఆత్మల దినోత్సవం) పురస్కరించుకుని మున్సిపల్ సిబ్బంది చేత శుభ్రత, లైటింగ్ ఏర్పాట్లను చేపట్టాలని స్థానిక మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ పేరు మీద ఇన్వార్డ్ సెక్షన్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా సమాధుల పండుగకు అన్ని ఏర్పాట్లు చేయించాలని ఆయన కమిషనర్‌ను అభ్యర్థించారు.
నవంబర్ 2వ తేదీన పెద్దల సమాధులను దర్శించుకునేందుకు, వారి సమాధుల వద్ద క్యాండిల్స్ వెలిగించి, పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివస్తారని మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్ తెలిపారు. సమాధుల తోట చుట్టూ మరియు లోపల పారిశుద్ధ్య పనులు, అలాగే సరైన లైటింగ్ ఏర్పాట్లు చేపట్టడం వలన భక్తులకు, సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివస్తారన్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



