Tuesday, October 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'బుడగలు'-నయా ఉదారవాదం

‘బుడగలు’-నయా ఉదారవాదం

- Advertisement -

నయా ఉదారవాదం అనివార్యంగా మాంద్యానికి దారితీస్తుంది. దీనికి రెండు కారణాలు. మొదటిది: ఆదాయాల్లో అసమానతలు పెరగడం. ఈ అసమానతలు అలా పెరుగుతూనే పోతాయి. పేదలు తమ ఆదా యాలను పూర్తిగా ఖర్చు చేస్తారు. కాని సంపన్నులు కొంతవరకే ఖర్చు చేసి తక్కినది దాచుకుంటారు. సంపన్నుల వాటా పెరుగుతున్న కొద్దీ వినిమయం కోసం మొత్తంగా సమాజంలో చేసే ఖర్చు తగ్గిపోతూ వుంటుంది. దాంతో మొత్తంగా మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపోతూ వుంటుంది. అప్పుడు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించడం జరగదు. దాని ఫలితంగా నిరుద్యోగం పెరుగుతుంది. అది డిమాండ్‌ను మరింత తగ్గిస్తుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దిగజారిపోతూ వుంటుంది.

నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి దేశాల సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తం మీద సంచరిస్తూ వుంటుంది. ఎక్కడ చౌకగా కార్మికశక్తి లభిస్తూ వుంటుందో అక్కడికల్లా పోతుంది. మూడవ ప్రపంచ దేశాలలో వేతనాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక సంపన్న దేశాల నుండి పెట్టుబడి మూడవ ప్రపంచ దేశాలకి తరలిపోతుంది. దాని ఫలితంగా ప్రపంచం మొత్తం మీద చూసుకున్నప్పుడు కార్మికుల వేతనాల వాటా తగ్గిపోతూ, పెట్టుబడిదారుల లాభాల వాటా పెరుగుతూ వుంటుంది. అది ఆదాయాల్లో అంతరాలను నిరంతరం పెరుగుతూ వుండడానికి కారణం. పోనీ, ఆ మూడవ ప్రపంచ దేశాలలో నిరుద్యోగం ఏమైనా తగ్గుతుందా అంటే అదీ ఉండదు. నయా ఉదారవాద విధానాల ఫలితంగా రైతులకు, చేతివృత్తిదారులకు, చిన్న, మధ్యతరహా పెట్టు బడిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు, మద్దతు తగ్గిపోతాయి. దాంతో ఆ రంగాల నుండి చేతివృత్తి దారులు, రైతుకూలీలు తప్పుకుని ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం పట్టణాలకు తరలుతారు. దాంతో పట్టణాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. అది మాత్రమే కాదు. నయా ఉదారవాద విధానాల వలన కొత్త సాంకేతిక పద్ధతులను చేపట్టి ఉత్పాదకతను పెంచడానికి పూనుకుంటారు. అందువలన కొత్తగా ఏర్పడే ఉద్యోగాలు చాలా పరిమితంగా ఉంటాయి. మరోపక్క ఉత్పాదకత పెరుగుతున్నకొద్దీ నిజవేతనాలు దానికి తగ్గట్టుగా పెరగవు. చౌకగా కార్మికశక్తి లభించడమే కారణం. అందు వలన ఉత్పాదకత పెరుగుదలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగకుండా వెనుకబడిపోతాయి. ఇదంతా ఆదాయాల్లో అసమాన తల పెరుగదలను వేగవంతం చేస్తుంది. అది నయా ఉదారవాద వ్యవస్థను మాంద్యం లోకి నెడుతుంది. ఇది మొదటి కారణం.

ఇక రెండో కారణం: జరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచేదిశగా జోక్యం చేసుకోవడంలో ప్రభుత్వాల అశక్తత. ఆర్థిక మాంద్యం నుండి కోలుకోడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కీలకం అని జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ భావించాడు. అటువంటి జోక్యం ద్వారానే పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడ నిరంతరాయంగా కొనసాగగలదని అతడు ఆశపడ్డాడు. అలా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అంటే ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచడం ద్వారా మాత్రమే సాధ్యం. ద్రవ్యలోటును పెంచడమో లేక సంపన్నుల మీద పన్నులను పెండమో చేస్తే తప్ప ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచడం సాధ్యపడదు. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఈ రెండింటిలోనూ దేనినీ అంగీ కరించదు. అందుచేత ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచడం నయా ఉదారవాద వ్యవస్థలో కుదరదు. ఇక్కడ కీన్స్‌ సూచించిన పరిష్కారం పనిచేయదు. మామూలుగా అయితే నయా ఉదారవాద వ్యవస్థలో మాంద్యం నుంచి కోలుకునే పరిష్కారం ఏదీ లేదు.

ఇక్కడ ‘బుడగలు’ నయా ఉదారవాదానికి అక్కరకు వస్తాయి. మార్కెట్‌లో జరిగే చట్టా వ్యాపారం లేదా స్పెక్యులేషన్‌ మార్కెట్‌లోని ఆస్తుల (షేర్లు, భూములు, ఫ్యూచర్లు వగైరాలు) ధరలను ఆకాశం అంటేలా పెంచుతుంది. వాటిలో పెట్టుబడులు పెడితే తమరు అధిక లాభాలు వస్తాయన్న ఆశ మదుపరుల్లో కలుగుతుంది. ఈ మదు పరులలో చాలామంది తమవద్ద ఉన్న సంపద వాస్తవంగానే పెరుగుతోందని, తాము సంపన్నులమైపోయామని భావి స్తూ వుంటారు. దాంతో వారు ఉత్సాహపడి ఎక్కువ విలాసవంతంగా ఖర్చు చేస్తూ వుంటారు. వారి ఆస్తుల విలువలో పెరుగదల ఊహాజనితమే అయినా, వారు చేసే ఖర్చు మాత్రం వాస్తవమే. అందువలన మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుంది. మాంద్యంలోకి ఆర్థిక వ్యవస్థ జారిపోకుండా తాత్కాలికంగానైనా నిలబెడుతుంది.
అయితే ఇటువంటి ‘బుడగలు’ ఎటువంటి దీర్ఘకాలికమైన ఆర్థిక వృద్ధికీ దోహదం చేయలేవు. తాత్కాలికంగా ప్రభావం కలిగించగలవే తప్ప మాంద్యం నుండి కోలుకోడానికి తోడ్పడవు. వాటి తాత్కాలిక ప్రభావం ఉన్నతంకాలం ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుండి కోలుకుంటున్నట్టు కనిపిస్తుంది. అదే విధంగా ఆ బుడగలు పేలిపోగానే ఒక్కసారి ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. ఈ బుడగలు ఏదో ఒక ఒక కొత్త రకం టెక్నాలజీతో తయారైన ఉత్పత్తి మార్కెట్‌ లో ప్రవేశించినప్పుడో, లేదా కొత్త తరహా ఉత్పత్తి విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడో ఎక్కువ ఆశలను రేకెత్తిస్తాయి. అది స్పెక్యులేషన్‌కు దారి తీస్తుంది. ఈ కొత్త టెక్నాలజీతో ఒరిగేదేమిటో తెలిసేలోపు స్పెక్యులేటర్లు ప్రవర్తించే తీరు మీదకు అందరి దృష్టీ మళ్లుతుంది. ఆ జూదమే ప్రధానం అయిపోతుంది.

జోసెఫ్‌ షుంపీటర్‌ అనే ఆస్ట్రో-అమెరికన్‌ ఆర్థికవేత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఫలితంగా మాంద్యం నుండి కోలుకోడానికిగల అవకాశాలను సరిగ్గానే అంచనా వేశాడు. కాని, దాని ఫలితంగా జరిగే అధికోత్పత్తి విషయ ంలో ఘోరంగా తప్పుడు నిర్ధారణలకు వచ్చాడు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టిన కారణంగా వస్తువుల ధరలు తగ్గిపోతా యని అనుకున్నాడే తప్ప ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని అతడు అంచనా వేయలేదు. ఆర్థిక వ్యవస్థలో దాదాపు అందరికీ ఉపాధి అవకాశాలు ఎప్పుడూ లభిస్తూనే వుంటాయన్న అవగాహనతోటే అతడు వ్యవహరించాడు. అందు వలన ఒకసారి బుడగ ప్రభావం తగ్గి అది చప్పబడ్డాక అప్పటికే పెరిగిన ఉత్పాదక ఫలితంగా కార్మికులకు మెరుగైన జీతాలు చవకగా సరుకులు లభిస్తాయని అతడు నిర్ధారించాడు. ఈ నిర్ధారణ ఊహాజనితేమే కాని వాస్తవం కాదు. ఎలాగో చూద్దాం.

నయా ఉదారవాద కాలంలో ఇప్పటివరకూ రెండు బుడగలు వచ్చాయి. మొదటిది డాట్‌ కామ్‌ బబుల్‌. ఇది 1990 దశకంలో వచ్చింది. రెండవది హౌసింగ్‌ బబుల్‌. ఇది మొదటి బబుల్‌ తర్వాత వచ్చింది. ఈ రెండూ అమెరి కాలోనే వచ్చాయి. హౌసింగ్‌ బబుల్‌ పేలిపోయిన తర్వాత దీర్ఘకాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకు పోయింది. ఈ బుడగలు పేలిపోవడం ఆ మాంద్యాన్ని మరింత ముదరబెట్టింది కూడా. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం 1981 వరకూ సాధించిన వృద్ధిరేట్లతో పోల్చితే 1982-91, 1992-2001, 2002-2011 దశకాల్లో వృద్ధిరేటు తగ్గిపోయింది. ఆ తర్వాత ఈ రెండు బుడగలూ ఏర్పడి పేలిపోయాయి. ఆ తర్వాత కాలంలో (కరోనా ఫలితంగా వచ్చిన సంకట స్థితి నుండి బయటపడ్డాక) ఉన్న వృద్ధిరేటు అంతకన్నా తక్కువగా ఉంది.
ఇప్పుడు ఎ.ఐ టెక్నాలజీని ప్రవేశ పెట్టడం ద్వారా నెలకొంటున్న కొత్త బుడగ ఇప్పుడున్న మాంద్యం నుండి ఆర్థిక వ్యవస్థను బైటపడవేస్తుందన్న ఆశలు కొంతమందిలో నెలకొంటున్నాయి. ఈ సారి ఎ.ఐ బుడగ నిలకడగా, పేలి పోకుండా అలాగే కొనసాగుతుందన్న ఆశలూ దాంతోబాటే ఏర్పడుతున్నాయి. ఆర్థిక కొలతల ప్రకారం ఎ.ఐ బుడగ సైజు పెద్దదే. కాని వాస్తవ ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు అంశాలను మనం గమనించాలి.
మొదటిది: ఎ.ఐ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద సానుకూలంగానే పడినప్పటికీ, దాని ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఎఐ ప్రవేశపెట్టిన తర్వాత కూడా అమెరికాలో దాని ప్రభావం యువజనుల నిరుద్యోగాన్ని తగ్గించలేదు. జూలే 2024లో అక్కడ యువత నిరుద్యోగం 9.8 శాతం ఉంటే, జులై 2025లో అది 10.8 శాతానికి పెరిగింది. అంటే ఎ.ఐ వలన ఉపాధి అవకాశాల పెరుగుదల పెద్దగా లేదని స్పష్టం అవుతోంది.

రెండవది: ఎ.ఐ బుడగ పేలిపోవడం అనివార్యం. ఏ బుడగ అయినా పేలిపోవలసిందే. అలా పేలిపోయిన తర్వాత అమెరికాలో నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోవడం తధ్యం. ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశ పెడుతున్న కాలంలో ఏర్పడే ఉపాధి అవకాశాలు అది ప్రవేశ పెట్టడం పూర్తైన తర్వాత తగ్గిపోతాయి. అంటే ఎ.ఐ ఒక బుడగగా పరిణమించకపోయినా దానిని ప్రవేశ పెట్టడం పూర్తి అయిన తర్వాత ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. రెండవది ఎ.ఐ స్వభావమే ఉపాధి అకాశాలను తగ్గించడం. అందుచేత అది ప్రవేశించడంతో ఉపాధి అవకాశాలు అంతకు మునుపు ఉన్నవి హరించుకుపోతాయి. మూడవది: మొత్తంగా చూసినప్పుడు ఉద్యోగులకు లభించే వాటా (జీతాల రూపంలో) తగ్గిపోతుంది. దాని వలన ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయి. ఈ మూడింటి వలనా దీర్ఘకాలంలో నిరుద్యోగం స్థాయి పెరిగిపోతుంది. అది నయా ఉదారవాద వ్యవస్థలో మాంద్యాన్ని మరింత పెంచుతుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత హేతువిరుద్ధమైనదో ఈ ఎ.ఐ ని ప్రవేశపెట్టడమే విదితం చేస్తోంది. టెక్నాలజీ అనేది మనిషి శ్రమను తగ్గించడానికి దోహదం చేయాలి కాని శ్రమించే అవకాశాలను దూరం చేయడానికి దారి తీయ కూడదు. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో అదే జరుగుతోంది. అదే సోషలిజంలోనైతే, ఇటువంటి కొత్త టెక్నాలజీ ప్రవేశం వలన కార్మికుల నిజవేతనాలు ఏమాత్రమూ తగ్గవు సరికదా వారికి తీరుబాటు సమయం పెరుగుతుంది. దాని ఫలితంగా మానవుల సామర్ధ్యం పెరుగుతుంది. అదే కొత్త టెక్నాలజీని పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రవేశ పెట్టినప్పుడు అందుకు పూర్తి భిన్నంగా నిజవేతనాలు పడిపోడానికి, ఉపాధి అవకాశాలు తగ్గిపోడానికి, పర్యవసానంగా మానవుల సామర్ధ్యం తగ్గిపోడానికి అది దారి తీస్తుంది.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -