గువహతి : టీనేజర్ ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక ఐఏఎస్ అధికారి సోమవారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాల ప్రకారం ఈ నెల 23న పాపుమ్ పరే జిల్లాలోని లేఖి గ్రామంలో 19 ఏండ్ల గోమ్చు యేకర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అతని గదిలో అనేక లేఖలను గుర్తించారు. ఈ లేఖల్లో ఐఏఎస్ అధికారి తలో పోటోమ్, రాష్ట్ర గ్రామీణ పనుల విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లిక్వాంగ్ లోవాంగ్ తనపై అసహజ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యేకర్ రాసాడు. నిరంతర అవమానాలు, బలవంతం, బెదిరింపులు కారణంగా ఆత్మహత్య వైపు తనను నడిపించాయని కూడా తెలిపారు. దీంతో యేకర్ తండ్రి ఫిర్యాదు మేరకు నిర్జులి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ఎఫ్‌ఐఆర్‌లో తలో పోటోమ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. కాగా, యేకర్ ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల్లోనే లోవాంగ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోటోమ్ పరారయ్యారు. దీంతో పోటోమ్‌పై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోటోమ్ సోమవారం ఉదయం 7:30 గంటలకు నిర్జులి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు అతన్ని జ్యుడిషయిల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. 14 రోజుల కస్టడీ విధించారు. అలాగే, పోలీసులకు లొంగిపోయే ముందు పోటోమ్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తనపై అభియోగాలను తిరస్కరించారు. మృతుడితో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని, తాను ఇటానగర్‌లో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో మృతుడ్ని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సభ్యుడిగా నియమించినట్టు గుర్తు చేసుకున్నారు. ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని అందుకే యేకర్ మరణంపై న్యాయమైన దర్యాప్తు జరగడానికే తాను లొంగిపోతున్నట్టు వెల్లడించారు.



