Tuesday, October 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోర్టర్‌ యాప్‌ డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించాలి

పోర్టర్‌ యాప్‌ డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించాలి

- Advertisement -

– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ డిమాండ్‌
– పోర్టర్‌ ఆఫీస్‌ వద్ద సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో

పోర్టర్‌ యాప్‌ మేనేజేమెంట్‌ తమ సర్వీస్‌ పార్ట్‌నర్లుగా ఉన్న డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.అజయ్‌ బాబు డిమాండ్‌ చేశారు. పోర్టర్‌ ఆఫీస్‌ వద్ద సోమవారం ఆ సంఘం సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పోర్టర్‌ యాప్‌లో 30 వేల మంది డ్రైవర్లు పనిచేస్తున్నారని, వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వీస్‌ పార్ట్‌నర్స్‌ పేరుతో డ్రైవర్ల సేవల్ని వినియోగించుకుంటున్నారని, అందుకు కమీషన్‌ 12-19శాతం వరకు తీసుకుంటున్నారని చెప్పారు. కానీ, చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లను సస్పెన్షన్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్‌ అందించే క్రమంలో యాక్సిడెంట్‌ అయినా.. కస్టమర్‌తో సమస్యలు వచ్చినా మేనేజేమెంట్‌ కలగజేసుకోవట్లేదని, ఎలాంటి సహకారమూ అందించట్లేదని అన్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు గతంలో ఇచ్చిన దానికంటే తక్కువ రేట్లు ఇస్తున్నారని తెలిపారు. వాస్తవంగా పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ రేట్లకనుగుణంగా కిరాయి రేట్లు పెంచి ఇవ్వాల్సింది పోయి గత సంవత్సరం కంటే తక్కువ రేట్లు ఇస్తున్నారని, ఇది అన్యాయం అన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పోర్టర్‌ కమీషన్‌ 5-8శాతం మాత్రమే తీసుకోవాలని, డ్రైవర్లకు ఇచ్చే కిరాయి రేట్లు పెంచాలని కోరారు. కిరాయి నిర్ణయించేటప్పుడు డ్రైవర్‌ను సంప్రదించాలని సూచించారు. డ్రైవర్‌కు సర్వీసు ఇచ్చే సందర్భంలో ఏ సమస్య ఎదురైనా దానికి పోర్టల్‌ బాధ్యత వహించాలన్నారు. సర్వీస్‌ పార్ట్‌నర్‌కు తగిన సహకారం అందించే బాధ్యత పోర్టర్‌ తీసుకోవాలని, సర్వీస్‌ పార్ట్‌నర్‌కు ఏ సమస్య వచ్చినా తక్షణమే సహకారమందించే యంత్రాంగం పోర్టల్‌ ఆఫీసులో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోర్టర్‌ రీజినల్‌ హెడ్‌ ప్రభురాజ్‌ బృందంతో చర్చలు జరిపారు. పది రోజుల్లో తమ పరిధిలోని సమస్యల పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని, మిగిలినవి టాప్‌ మేనేజేమెంట్‌తో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ చర్చలలో ఉమేష్‌ రెడ్డి, మహేశ్‌, మునీర్‌, జీవన్‌, కలిం, ముఖేశ్‌, మాజిద్‌, మీర్జా తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జి.నరేశ్‌, నగర నాయకులు జావిద్‌, మల్లేశ్‌, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ నాయకులు రవీందర్‌, సిరాజ్‌, సంగమేశ్‌ ఇతర అడ్మిన్లు పాల్గొన్నారు. అనంతరం పోర్టర్‌ యాప్‌ సర్వీస్‌ పార్టనర్స్‌(డ్రైవర్స్‌) సమస్యలపై లేబర్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా నిర్వహించి.. అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ గంగాధర్‌కి మెమోరాండం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -