బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను వెంటనే ఆమోదించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన రాజీనామాను ఆమోదించాలని కల్వకుంట్ల కవిత ఈ ఏడాది సెప్టెంబర్ 3న మండలి ఛైర్మన్ కు ఫార్మాట్ లో లిఖితపూర్వకంగా లేఖ రాశాన్నారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ ఛైర్మన్ నిర్ణయం తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికీ తెలంగాణ శాసనమండలి అధికారిక వైబ్సైట్ లో ఆమెను ఎమ్మెల్సీగానే చూపిస్తున్నారని.. ఇంకా రాజీనామాను ఆమోదించలేదని వెల్లడించారు.
స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ.. తెలంగాణ శాసన మండలి ప్రవర్తన నియమావళి నెం.190 కింద సూచించబడిన ఫార్మాట్ కింద ఎమ్మెల్సీ కవిత రాజీనామా సమర్పించినప్పటికీ ఛైర్మన్ ఆమోదించకపోవడంపై ఆంతర్యమేమిటో స్రవంతిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఛైర్మన్ విచారణ సమయంలో రాజీనామా స్వచ్ఛందంగా లేదా నిజమైనది కాదని నిరూపిస్తేనే తిరస్కరించవచ్చని సుప్రీంకోర్టు సైతం స్పష్టంగా పేర్కొందన్నారు. అయితే ఎమ్మెల్సీ స్పష్టంగా రాజీనామా సమర్పించినందున రాజీనామాను ఆమోదించడం తప్ప వేరే మార్గమే లేదన్నారు. కవిత సైతం తన రాజీనామా లేఖను సమర్పించే ముందు విలేకరుల సమావేశం నిర్వహించి, ఆమె తన స్వేచ్ఛా సంకల్పంతో రాజీనామా చేస్తున్నట్లు సైతం ప్రకటించారన్నారు. కాబట్టి తక్షణమే ఆమె రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి ఛైర్మన్ను కోరారు.



