తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనున్నట్లు భారత ఎన్నికల సంఘం ఏకపక్షంగా ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరం. ఎన్నికల ప్రక్రియకు రెండునెలల ముందు హడావిడిగా బీహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో అత్యున్నత న్యాయస్థానం విచారిస్తున్న ప్రస్తుత దశలో 51 కోట్ల మందిపైగా ఓటర్ల భవితవ్యాన్ని నిగ్గుతేల్చే ఎస్‌ఐఆర్‌ను హడావిడిగా చేపట్టడం ప్రజాస్వామ్యం పట్ల ధిక్కార ధోరణే. స్థానిక సంస్థలకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎస్‌ఐఆర్ చేపట్టవద్దని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని సైతం పక్కనపెట్టడం ఈసి పారదర్శకతనే ప్రశ్నార్థకం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదనడం అడ్డగోలుగా వ్యవహరించ డమే. రాష్ట్రాల పట్ల, స్థానిక సంస్థల పట్ల ఎంతమాత్రమూ గౌరవం లేకపోవడమే!
ఓటర్ల జాబితాను ఎప్పటి కప్పుడు సరిచేయడం అత్యవసరం. ప్రజలు తమ ఉపాధి, విద్య, ఉద్యోగం తదితర అవసరాల కోసం తమకు అనువైన ప్రాంతాలకు మారుతూ ఉండటం, కొంతమంది చని పోవడం, పద్దెనిమిదేండ్లు నిండినవారు కొత్తగా నమోదు కావడం సహజం. ఓటర్ల జాబితా ఆధునీకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా, రాజకీయ పక్షపాత రహితంగా, అనుమానాలకు తావివ్వని విధంగానూ ఉండాలి. ఎన్నికల సంఘం విశ్వసనీయత అత్యంత ప్రధానం. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికలు భారత రాజ్యాంగ మౌలిక వ్యవస్థలో భాగం. వాటిని నిర్వహించే ఎన్నికల కమిషన్ నియామక వ్యవస్థను భ్రష్టుపట్టించిన ఘనత కేంద్రంలోని మోడీ ప్రభుత్వానిదే. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను చేపట్టే విధానాన్ని మార్పు చేసింది. సిజెఐని తొలగించి, ఆ స్థానంలో సీనియర్ కేబినెట్ మంత్రిని సభ్యుడిగా చేర్చింది.
ఈ విధానం సరికాదని, ఎన్నికల కమిషనర్ల నియామకంలో అధికార పార్టీకి అనుచితమైన అధికారం ఉండకూడదని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెడుతూ పార్లమెంటులో ఏకపక్షంగా చట్టం చేసింది. ఆ తరువాత సిఈసి 2002-2004 మధ్య ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్‌ఐఆర్ చేపట్టాలన్న నిర్ణయంసహా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై ఈసి తీరు అనుమానాలకు తావిస్తోంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఓట్ల చోరీ జరిగిందంటూ చేసిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని సరిచేయాల్సిన బాధ్యత ఈసిది. అందుకు భిన్నంగా ప్రతిపక్ష నేత తన ఆరోపణలన్నీ నిజమేనని అఫిడవిట్ దాఖలు చేయాలని లేదా క్షమాపణ చెప్పాలని చేసిన ప్రకటన, సిఈసి వ్యవహరించిన తీరు బెదిరించేలా ఉండటం, పాలక పార్టీ అధికార ప్రతినిధిని తలపించడం ఆక్షేపణీయం. బీహార్ ఎస్‌ఐఆర్ ఎన్నికలకు రెండు నెలల ముందు చేపట్టడం, ఆధారంగా తీసుకున్న గుర్తింపు కార్డుల జాబితాను సుప్రీంకోర్టుసైతం ప్రశ్నించింది.
రెండు శాతం మందికి ఉండే పాస్‌పోర్టును గుర్తింపు పత్రంగా అంగీకరించి, 87 శాతం మంది వద్ద ఉండే ఆధార్‌ను, స్వయంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తింపు కార్డుగా అంగీకరించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తొలగించిన జాబితాను ఇసి ప్రకటించాల్సి వచ్చింది. బీహార్ ఎస్‌ఐఆర్ తుది జాబితాలో ప్రధా నంగా నష్టపోయింది పేదలే. తొలగించిన 65 లక్షల మందిలో అత్యధికులు మహిళలు, ముస్లింలు, ఎస్‌సి, ఎస్‌టి తదితర అణగారిన తరగతులే. పదహారు లక్షల మంది తొలగింపుతో మహిళా ఓటర్ల శాతం పురుషులతో పోలిస్తే… వెయ్యికి 907 నుంచి 892కి పడిపోయింది. బీహార్ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వని ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ చేపట్టడం ఓటర్ల జాబితాలను తారు మారు చేయాలన్న పాలక పార్టీ దుష్ట పథకానికి వత్తాసు పలకడమే. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల అభ్యంతరాలను పక్కన పెట్టడం ఫెడరలిజానికి గొడ్డలిపెట్టు. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
అప్రజాస్వామికం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



