Wednesday, October 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి

ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి

- Advertisement -

టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్‌, ముజీబ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం 22 నెలలుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అనేక సార్లు ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీతో చర్చలు జరిపామని అన్నారు. వారు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం శోచనీయమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం పెండింగ్‌ బిల్లులు నెలకు రూ.700 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీతోనే పథకాన్ని ప్రారంభిస్తామంటూ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదన్నారు.

బకాయిపడ్డ ఐదు డీఏలను అడిగితే కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం సరైంది కాదని అన్నారు. 2023, జులై ఒకటి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ (పీఆర్సీ) మాటే ఎత్తకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సీఎం, మంత్రిమండలి సభ్యుల ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులందరూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? అనే అనుమానం కలగకుండా ఉండాలంటే, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ బిల్లులను యుద్ధప్రాతిపదికన మంజూరు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని చెప్పారు. ఆరోగ్య రక్షణ పథకాన్ని (ఈహెచ్‌ఎస్‌) పూర్తి స్థాయిలో అమలుచేయాలని సూచించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. వివిధ కారణాలతో సస్పెండ్‌ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్‌ టీఎన్జీవోలకు కేటాయించాలని చెప్పారు. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి పదోన్నతులను ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకట్‌, కోశాధికారి బి ముత్యాల సత్యనారాయణ గౌడ్‌, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు తదితరులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మణ్‌, ఆదిలాబాద్‌ జిల్లా మాజీ అధ్యక్షులు సంధ్య అశోక్‌లకు సన్మానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -