ప్రజాభవన్‌లో అధికారులకు యూనియన్ నేతల వినతి
సానుకూలంగా అధికారుల స్పందన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎంలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు ప్రజాభవన్‌లో ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నా రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. 9 నుంచి 14 నెలలు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వారాంతపు, పండగ, ప్రసూతి సెలవులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేతనాలు పెండింగ్‌లో ఉండటం వల్ల దసరా, దీపావళి పండుగలను సంతోషంగా జరుపుకోలేక పోయామని పేర్కొన్నారు.
కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వారాంతపు సెలవులు ఇవ్వక పోవటంతో నెల మొత్తం పని చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఏ రోజైనా విధులకు హాజరు కాలేక పోతే, ఆరోజు వేతనం కట్ చేస్తున్నారని తెలిపారు. దసరా, సంక్రాంతి ఇతర పండుగ సెలవుల్లో వేతనాలు కట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రసూతి సెలవులు అమలు చేయడం లేదని తెలిపారు. పిఎఫ్ కట్ చేస్తున్నప్పటికీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు వాటి వివరాలను కార్మికులకు అందజేయడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈఎస్‌ఐ సౌకర్యం కూడా ఏఎన్‌ఎంలకు అందుబాటులో లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో వేతనాలు చెల్లిస్తాం
రెండు రోజుల్లో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె మాట్లాడారు. రెండు రోజుల్లో వేతనాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా అమలు కావాల్సిన సెలవులు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. సెలవులు టైమింగ్స్ ని అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి మధు యూనియన్ నాయకులు కమల, మహేశ్వరి, కామేశ్వరి, జంగుబాయి, జయశ్రీ ,మమత, కరుణ ,లక్ష్మి ,వందన, శిరీష, బాలు తదితరులు పాల్గొన్నారు.



