నవతెలంగాణ – ఊరుకొండ : ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న మోంథా తుఫాన్ వర్షాల వల్ల ఊర్కొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య సిబ్బందికి సూచించారు. బుధవారం మోంథా తుఫాన్ వర్షాల వల్ల ఊరుకొండ మడలంలో పలు గ్రామాలను స్థానిక ఎస్సై తో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లపై, చెరువుల అలుగులపై పారుతున్న నీటి అంచనాను గుర్తించి రాకపోకలు నివారించుటకు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఊర్కొండపేట నుండి నర్సంపల్లి వెళ్లే దారిలో, జకినాలపల్లి నుండి ఊర్కొండపేట, ముచ్చర్లపల్లి నుండి బొమ్మరాజు పల్లి మరియు జకినాలపల్లి నుండి జిల్లెల్ల రోడ్లపై నీటి ప్రవాహన్ని పరిశీలించి జకినాలపల్లి నుండి జిల్లెల్ల వెళ్లే దారిలో రాకపోకలు జరుగకుండా రోడ్డుపై కంపచెట్లతో కంచె వేయడం జరిగిందని తెలిపారు.
నర్సంపల్లి గ్రామ పరిధిలోని రేకులకుంట చెరువు కట్ట ఉపరితలం పై భాగం వరకు నీరు చేరినందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనుటకు మాజీ సర్పంచ్ వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ మరియు గ్రామస్తులతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచుకొనుటకు తగు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. రాంరెడ్డిపల్లి, ముచ్చర్లపల్లి రహదారిపై కూడా రాకపోకలు నివారించడం జరిగింది. రాచాలపల్లి, ఊర్కొండపేట గ్రామాల్లో కొన్ని ఇండ్లలోకి నీరు చేరడంతో నీటి తరలింపు చర్యలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. వారిని బంధువుల ఇండ్లలో నివాసం ఉండే విధంగా తగు సూచనలు చేసినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చుటకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎవరైనా పంచాయతీ కార్యదర్శులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోబడునని, తుఫాన్ తగ్గేవరకు అందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరిశీలనలో ఎస్సై కృష్ణదేవ్, పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీం, ఇరిగేషన్ ఏఈ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు, తదితరులు ఉన్నారు.



