– పీవీఆర్‌లో ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి : తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ (సీఐటీయూ) యూనియన్ డిమాండ్
– పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద కార్మికుల నిరసన
– ఆందోళనకు అనుమతి లేదని వారిని పోలీస్టేషన్‌కు తరలించిన పోలీసులు
నవతెలంగాణ-బంజారాహిల్స్
పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో మహిళా కార్మికులపై వేధింపులు ఆపాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. పీవీఆర్ కార్మికులు మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ మాల్ ముందు బైటాయించి ప్లకార్డులు చేత బట్టి నినాదాలు చేశారు. అయితే, నిరసనకు అనుమతి లేదంటూ పంజాగుట్ట పోలీసులు వారిని అడ్డుకొని ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు మారన్న మాట్లాడుతూ.. పీవీఆర్‌లో మహిళా కార్మికులు వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముగ్గురి పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విధుల్లో ఉన్న కార్మికులు మధ్యాహ్న భోజనం ప్రతి రోజూ మూడు గంటలకు చేయాలనే నిబంధన పెడుతున్నారని చెప్పారు. అంతేకాక కార్మికులు అనారోగ్యంతో ఒక్క రోజు విధులకు వెళ్లకపోయినా, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే డ్యూటీకి రావద్దని హుకుం జారీ చేస్తున్నట్టు తెలిపారు. కార్మికులు అవసరమైన రోజు సెలవు తీసుకోవాలన్నా ఒప్పుకోకుండా మేనేజ్‌మెంట్‌కు అనుకూలమైన రోజుల్లో మాత్రమే సెలవు తీసుకోవాలంటున్నారని విమర్శించారు. మహిళా కార్మికుల సమస్యలపై హెచ్‌ఆర్ దృష్టికి తీసుకెళ్దామంటే వారు టైమ్ ఇవ్వరని, వారంలో ఒక్కసారి మాత్రమే కలవాలని నిబంధనలు పెడుతున్నారని తెలిపారు. దీంతో పీవీఆర్ సెంట్రల్ మాల్‌లో మహిళా కార్మికులపై వేధింపులకు సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అయితే, ఫిర్యాదు చేసిన కార్మికురాలిని విధుల నుంచి తొలగించారని, వేధించిన వ్యక్తిని మాత్రం డ్యూటీలో పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూకట్‌పల్లి ప్రాంతంలోని పీవీఆర్ సంస్థలో ఒక కార్మికుడు విధుల్లో చనిపోతే యాజమాన్యం నష్టపరిహారం ఇస్తామని చెప్పి కేసు పెట్టకుండా అడ్డుకొని.. సంవత్సరాలు గడిచినా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు పి.పుల్లారావ్, అరుణ్, నాయకులు కమలాకర్, రామస్వామి, సుధాకర్, రాజు, భరత్, సీఐటీయూ సెంట్రల్ సిటీ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి ఐ.రాజశేఖర్, సినిమా థియేటర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నరసయ్య, చలం, సుధాకర్ రాజు, రామస్వామి, భరత్, మురళి, శశిధర్‌రెడ్డి, మహిళా కార్మికులు హారతి పటేల్, దుర్గా పాల్గొన్నారు.
మహిళా కార్మికులపై వేధింపులు ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES