నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకొని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా పాఠాలు బోధించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. బుధవారం గద్వాల బాలభవన్ లో విద్యాశాఖకు సంబంధించిన పలు యాప్ లు, వివిధ పోర్టల్ ల గురించి జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఐ, ఇతర టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరు మెరుగుపడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా తమ విధులు నిర్వహించాలన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దెందుకు ఉపాధ్యాయులు ప్రయోగపూర్వకంగా, వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు.
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మన జిల్లా మెరుగైన స్థానాన్ని పొందేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించినందున, దాని ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు. తాను తరచు జిల్లాలోని పలు ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శిస్తున్నానని, విద్యార్థుల నైపుణ్యాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చాలామంది విద్యార్థులు సరిగ్గా చదవలేక పోతున్నారని, వారికి అర్థమయ్యే రీతిలో బోధించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కెరీర్ కు ఉపయోగపడేలా పాఠ్యాంశాలు బోధించాలని, ఫలితంగా వారిలో నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు.
మన రాష్ట్రం విద్యారంగంలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించేందుకు అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో పరిశీలించేందుకు ప్రతి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి త్వరలోనే విదేశాలకు పంపుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడమే కాక వివిధ విద్యా శాఖ కార్యక్రమాలతో ఉపాధ్యాయులకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాపరంగా జోగులాంబ గద్వాల జిల్లా మెరుగైన స్థానంలో ఉండాలంటే ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. అలసత్వం వహించే వారిని ఉపేక్షించేది లేదని, శాఖా పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ప్రధానోపాధ్యాయుల హ్యాండ్బుకును కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారులు శాంతిరాజు, హంపయ్య, ఎంఈఓ లు, తదితరులు పాల్గొన్నారు.



