– జాడే లేని టెండర్ల ప్రక్రియ
– గతేడాది డిసెంబర్ వరకూ కొనసాగిన పంపిణీ
– ముందస్తు ప్లాన్ లేకపోతే మత్స్యకారులకు నష్టమే
జలాశయాల్లో చేపల పెంపకమే జీవనాధారంగా ఉన్న మత్స్యకార వృత్తిదారులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పథకం ఏటేటా నీరుగారుతోంది. ఖర్చు చేసే వ్యయమే కాదు. పంపిణీ చేసే చేప పిల్లల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. గతేడాది ముందస్తు ప్లాన్ లేకపోవడంతో ఆలస్యమైంది. ఫలితంగా చేపలు ఆశించిన సైజు పెరగకపోవడం వల్ల వృత్తిదారులు నష్ట పోయారు. ఇప్పటివరకు 2025-26కు సంబంధించిన ప్రణాళికల్లేవు. ఏటా మే నెలలో జరగాల్సిన టెండర్ల ప్రక్రియ జాడలేదు. నైరుతీ రుతుపవ నాలు ముందస్తుగానే కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ చెప్పిన తరుణంలో ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జలాశయాల్లో నీళ్లు చేరే సమయానికి ఉచిత చేప పిల్లల్ని వదిలే అవకాశం ఉంటుందో లేదో అన్నది అనుమానంగా ఉన్నది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఉచిత చేప పిల్లల పథకం మత్స్య వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. చేపల పెంపకం వృత్తిగా ఉన్న ముదిరాజ్, బెస్త, గంగపుత్రులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. చేపల పెంపకం కోసం ఆర్థిక వెసులుబాటును కల్పించాలన్న లక్ష్యంతో 2016లో రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చేప పిల్లల్ని వదిలే కార్యక్రమం కొనసాగింది. ఈ ఏడాది అలా కాకుండా ముందస్తు టెండర్లు ఖరారు చేసి జలాశయాల్లోకి నీళ్లు చేరే జూన్, జులై మాసాల్లో పిల్లల్ని పంపిణీ చేసేం దుకు సిద్ధం చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 29434 చెరువులు, కుంటలున్నాయి. వీటిల్లో 80 కోట్ల వరకు చేప పిల్లల్ని వదలాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 851 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. వీటిల్లో 53312 మంది సభ్యులున్నారు. మెదక్ జిల్లాలో 1651 చెరువులు, కుంటలతో పాటు ఘన్‌పూర్, హాల్దీ, పోచారం ప్రాజెక్టుల్లో చేపలు వదిలేందుకు జిల్లాలకు 5.25 కోట్ల చేప పిల్లలు కావాల్సి ఉంది. సిద్దిపేట జిల్లాలో 1561 చెరువులు, కుంటలతో పాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ జలాశయాల్లో చేపల పెంపకం చేస్తారు. వీటిల్లో 4.30 కోట్ల చేప పిల్లల్ని వదలాలి. సంగారెడ్డి జిల్లాలో 1157 చెరువులు, కుంటలతో పాటు సింగూర్ లాంటి జలాశయాలున్నాయి. వీటిల్లోనూ 3.14 కోట్ల మేరకు చేప పిల్లల్ని వదలాల్సి ఉంది.
ఖరారు కాని టెండర్ల ప్రక్రియ
రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు అవసరమైన చేప పిల్లల్ని సరఫరా చేసేందుకు టెండర్లు పిలవాలి. కాంట్రాక్టు ముందుకొస్తే టెండర్లు ఖరారు చేసి ఒప్పందం చేసుకోవాలి. మే నెలలో టెండర్లు జరిగితే జూన్ వరకు చేప పిల్లలు అందుబాటులో ఉంచాలి. 80 నుంచి 100ఎంఎం సైజు ఉన్న చేప పిల్లల్ని పంపిణీ చేస్తే ఒక్కో చేప పిల్లకు రూ.1.73 చొప్పున చెల్లిస్తారు. ఇప్పటి వరకు చేప పిల్లల కోసం టెండర్లు పిలవలేదు. మే నెలలో టెండర్లు ఖరారు చేయకపోతే ఈ ఏడాది కూడా చేప పిల్లలు వదిలే కార్యక్రమం ఆలస్యం కానుంది.
ముందస్తుగా నైరుతీ రుతుపవనాలు
ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు ముందస్తుగా వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలాఖరులో కేరళను తాకనున్నందున జూన్ మొదటి, రెండో వారంలో వర్షాలు పడతాయని చెబుతున్నారు. అధిక వర్షపాతం నమోదైతే జులైలోనే చెరువుల నీటి మట్టం పెరిగే ఛాన్స్ ఉంది. ఆగస్టు వరకు పూర్తిస్థాయిలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుంటాయంటున్నారు. అందుకే జూన్, జులై మొదటి వారం వరకు చేప పిల్లల్ని చెరువుల్లో వదిలితే పెద్ద సైజు పెరిగేందుకు అవకాశముందని వృత్తిదారులు పేర్కొంటున్నారు.
గతేడాది తీవ్ర నష్టం
గతేడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చాలా ఆలస్యంగా సాగింది. పిల్లల్ని పంపిణీ చేయడం సెప్టెంబర్‌లో మొదలైంది. డిసెంబర్ వరకు పిల్లల్ని చెరువులు, కుంటల్లో వదిలారు. దాంతో చేపలు 1.50 కిలో నుంచి 2 కిలోల సైజు పెరగాల్సి ఉన్నా పావుకిలో, అరకిలో సైజే పెరిగాయి. దీని వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. బొచ్చ, రవ్వ, బంగారుతీగ, మ్రిగాల, రొయ్యల వంటి ఆయా రకాల చేపల్ని పెంచుతారు.
ఏటేటా తగ్గుతున్న వ్యయం, చేప పిల్లల సంఖ్య
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఏటేటా నీరుగారు స్తున్నారు. 2016లో 3939 చెరువుల్లో 27.8 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేసేందుకు రూ.22.46 కోట్ల నిధుల్ని ఖర్చు చేశారు. 2022- 23లో 23,799 చెరువుల్లో 77.14 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేశారు. ఇందు కోసం రూ.62.79 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 2024-25లో 14,304 చెరువుల్లో 29.25 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేసి రూ.34.25 కోట్ల నిధుల్ని మాత్రమే ఖర్చు చేశారు. ఏటేటా చెరువుల సంఖ్యే కాకుండా చేప పిల్లలు, వెచ్చించే నిధులు కూడా తగ్గిస్తూ వస్తున్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రణాళికేది..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES