ముందుకు పోలేరు : జూబ్లీహిల్స్ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘రన్నింగ్ బండి ఎక్కితేనే మీరు చేరాల్సిన చోటుకు చేరుతారు. మూలకుపడ్డ కారు ఎక్కితే అక్కడే ఉంటారు. ముందుకు పోలేరు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి’ అని రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు అల్లం భాస్కర్, చరణ్‌కౌశిక్ యాదవ్, బొమ్మ శ్రీరామ్‌తో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టాలని కోరారు. బీఆర్‌ఎస్ అధికారంలో లేదనీ, ఆ పార్టీకి ఓట్లు వేసినా ఉపయోగం లేదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కాదనీ, అభివృద్ధి, అబద్ధాలకు మధ్య జరుగుతున్న పోరాటమని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో బండలను కరిగించి. పేదలకు ఇంటి పట్టాలివ్వడంతోపాటు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కట్టించిందని గుర్తుచేశారు.
ఆ ప్రాంతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేసింది కూడా తమ ప్రభుత్వమేనని తెలిపారు. పదేండ్లుగా బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను రౌడీ అంటూ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ఆటోలో ప్రయాణం చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పదేండ్లలో ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. రామచందర్‌రావు బీజేపీ అధ్యక్షులుగా కాకుండా యూసుఫ్‌గూడ డివిజన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ‘ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ’లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు
కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు హస్తం గూటి కి చేరుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.



