న్యూఢిల్లీ: ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు, దేశంలో విద్యార్థి ఉద్యమ నిర్మాత, సిపిఎం మాజీ ఎంపి, చిత్ర దర్శకులు కామ్రేడ్ నేపాల్‌దేవ్ భట్టాచార్య మంగళవారం తుది శ్వాస విడిచారు. అఖిల భారత రోడ్డు రవాణ కార్మికుల సమాఖ్య (ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) అధ్యక్షులు, సిఐటియు అఖిల భారత వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న నేపాల్ దేవ్ భట్టాచార్య కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.కొన్ని రోజుల క్రితం కొల్‌కతాలో ఒక నర్సింగ్ హోమ్‌లో చేరిన భట్టాచార్య చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున 1:25 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏండ్లు.
1960 చివరిలో అంటే యువకుడిగా ఉన్న సమయంలో విద్యార్థి, కమ్యూనిస్టు ఉద్యమంలో నేపాల్‌దేవ్ భట్యాచార్య చేరారు. నిజానికి విద్యార్థి ఉద్యమ నిర్మాతల్లో ఆయన ఒకరు. 1979లో ఎస్‌ఎఫ్‌ఐ తొలి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, 1986 వరకూ ఆ పదవిలో కొనసాగారు. తరువాత ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చేరి పశ్చిమ బెంగాల్‌లో అసంఘటిత కార్మికులను సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే బెంగాల్‌లో రైల్ హాకర్ యూనియన్‌ను నిర్మించడంలో ముఖ్యపాత్ర పోషించారు. తరువాత రవాణ కార్మికుల ఉద్యమంలో చేరి బెంగాల్‌తో పాటు జాతీయ స్థాయిలో కూడా రవాణా కార్మికుల ఉద్యమానికి ముందు వరస నిర్వాహకుడిగా మారారు. 2022 జులైలో జరిగిన ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ 11వ మహాసభ ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే సిఐటియు ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా ఆయన సిఐటియు ఉత్తర 24 పరగణా జిల్లా కమిటీ అధ్యక్షులు కూడా. 1981లో బెంగాల్ నుంచి సిపిఎం అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఇటీవల ఆసుపత్రిలో చేరే వరకూ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చురుకుగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 24న నిర్వహించిన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ పార్లమెంట్ మార్చ్‌లోనూ, ఏప్రిల్ 25న కొల్‌కతాలో జరిగిన చారిత్రాత్మక బ్రిగేడ్ ర్యాలీ ప్రచారంలోనూ, ర్యాలీలోనూ కూడా భట్టాచార్య పాల్గొన్నారు.
ఉద్యమాలు, రాజకీయాలతో పాటు బెంగాలీ సినిమాకు కూడా భట్టాచార్య చెప్పుకోదగ్గ కృషి చేశారు. 2000లో మిధున్ చక్రవర్తి, దేవశ్రీ రారు నటించిన చకా చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆయన కళాత్మక సున్నితత్వం, సామాజిక ఆందోళనలను ప్రతిబింబిస్తుంది.నేపాల్‌దేవ్ భట్టాచార్య మృతిపై సిఐటియు, ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్, ఎఐకెఎస్ సంతాపం ప్రకటించాయి. మరణంతో ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఒక సీనియర్ ముందు వరస అనుభవజ్ఞుడైన నాయకుడ్ని కోల్పోయింది. ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి భారీ నష్టమని సిఐటియు తెలిపింది. భట్టాచార్య మృతితో ఆయన భార్య మంజుల భట్టాచార్య, ఇతర కుటుంబ సభ్యులు, మిత్రులకు సిఐటియు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది.
అలాగే, భట్టాచార్య మృతి ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా రవాణ కార్మికులు, శ్రమజీవులకు తీవ్రమైన నష్టంగా ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ పేర్కొంది. 2022 నుంచి ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడిగా ఉన్నారని, ఈ ఏడాది జులైలో తిరువనంతపురంలో 12వ మహాసభ జరగనుందని, ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఆయన మృతి కార్మిక వర్గ ఉద్యమానికి బాధాకరం, నష్టంగా పేర్కొంది.రాజ్యసభ సభ్యుడిగానూ ఆయన పదవీ కాలం యావత్తూ కార్మిక హక్కులు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన పోరాటంగా గుర్తిండిపోతుందని తెలిపింది.
విభిన్న వృత్తులను నిర్వహించినప్పటికీ కార్మిక వర్గం పోరాటాలు, ఆకాంక్షలను వ్యక్తీకరించడంలో భట్టాచార్య తన ఆదర్శాలను వీడలేదని, భట్టాచార్య వినయం, అర్హతలు సహోద్యోగులకు, ప్రజలకు ప్రియమైన వ్యక్తిగా చేశాయని ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ తెలిపింది.భట్యాచార్య మృతికి అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) సంతాపం ప్రకటించింది. భట్టాచార్య తన యావత్తూ జీవితాన్ని దేశంలో విప్లవాత్మక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికే అంకితం చేశారని ఎఐకెఎస్ నివాళిర్పించింది. భట్టాచార్య మార్గదర్శకత్వంలోనే ఎస్‌ఎఫ్‌ఐ దేశ విద్యార్థి ఉద్యమంలో ప్రముఖ సంస్థగా అవతరించిందని, మతతత్వ శక్తులకు, విద్యాను కార్పొరేట్లు స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ప్రతిఘటన శక్తిగా ఉద్భవించిందని తెలిపింది. మూడు దశాబ్దాలుగా కార్మిక వర్గ పోరాటంలో ధృఢంగా, అంకిత భావంతో భట్యాచార్య పనిచేశారని గుర్తు చేసుకోంది. రాజీపడిన ముందు వరస కమ్యూనిస్టు నేపాల్‌దేవ్ భట్టాచార్య లోటును పూడ్చడం చాలా కష్టమని ఎఐకెఎస్ నివాళిలర్పించింది.
ట్రేడ్ యూనియన్ సీనియర్ నేత కామ్రేడ్ నేపాల్‌దేవ్ భట్టాచార్య కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES