నవతెలంగాణ – హైదరాబాద్ : ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఇద్దరు ముస్లిం ఉద్యోగులను అక్రమంగా తొలగించిన ఘటన జమ్ముకాశ్మీర్‌లో జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గులాం హుస్సేన్, మాజిద్ ఇక్బాల్ దార్‌లను తొలగించాల్సిందిగా జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశించినట్లు అధికారులు గురువారం తెలిపారు. హుస్సేన్ రియాసి జిల్లాలోని మహోర్ తహసీల్‌లోని కల్వా ములాస్ నివాసి కాగా, దార్ రాజౌరీ జిల్లాలోని ఖెయోరా ప్రాంతంలో వార్డ్‌నెం.1లో నివసిస్తున్నారని అన్నారు.
కేసు వివరాలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, ఇద్దరు ముస్లిం ఉద్యోగుల కార్యకలాపాలు వారిని విధుల నుండి తొలగించేలా ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కన్నట్లు వేర్వేరు ఉత్తర్వులు తెలిపాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311లోని క్లాజ్ (2)లోని నిబంధనలల్లోని సబ్‌క్లాజ్ (సి) ప్రకారం.. రాష్ట్ర భద్రత దృష్ట్యా, ఈ కేసులపై విచారణ చేపట్టడం సముచితం కాదని గవర్నర్ ఆదేశించినట్లు ఉత్తర్వులు పేర్కొన్నాయి. గత కొన్నేళ్ల నుండి ఇప్పటి వరకు డజన్ల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగులను ఎటువంటి విచారణ లేకుండానే విధుల నుండి తొలగించిన సంగతి తెలిసిందే.

 
                                    