– జలదిగ్బంధంలో పలు కాలనీలు
– పునరావాస కేంద్రాలకు తరలింపు
నవతెలంగాణ-కాశిబుగ్గ
బుధవారం కురిసిన వర్షాలకు 14వ డివిజన్ పరిధిలోని ఎస్సార్ నగర్ కాలనీకి చెందిన అడుప కృష్ణమూర్తి (70) మృతి చెందాడు. కృష్ణమూర్తి భార్య కరోనా సమయంలో మృతి చెందడంతో పిల్లలు లేనందున ఎస్సార్ నగర్ లోని తన నివాసంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. బుధవారం కురిసిన భారీ వర్షానికి ఇంట్లోకి నీరు చేరడంతో కృష్ణమూర్తి మృతిచెందగా, గురువారం ఉదయం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని పని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
ఎస్సార్ నగర్ కాలనీ పూర్తిగా నీటిమునగ స్థానిక నాయకులు, ఏనుమాముల పోలీసులు కాలనీవాసులను ట్రాక్టర్ సహాయంతో 100 ఫీట్ల రోడ్డులోని శుభం గార్డెన్ కు తరలించారు. వారికి కావలసిన ఆహారం మంచినీటిని రెవెన్యూ అధికారులు అందించారు. అదేవిధంగా లేబర్ కాలనీ ఏనుమాముల మార్కెట్ రోడ్డు, వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, పద్మా నగర్ తదితర ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనా దారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాశిబుగ్గ, ఏనుమాముల, తదితర ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులు పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు.



