– రైతు కష్టం వర్షార్పణం
– మండలంలో వందలాది ఎకరాల్లో పంట నష్టం
– నీట మునిగిన వరి పొలాలు…
– వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆరబోసిన పంటలు
– పంట సుమారు 950 ఎకరాల్లో పంట నష్టం
– తడిసిన 1500 క్వింటాళ్ల ధాన్యం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మొంథా తుఫాన్ ప్రభావం రైతుల కంట కన్నీరు తెప్పిస్తుంది. తుఫాన్ ప్రభావం మండలంలో తీవ్రంగా కనిపించింది.బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు 115.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. బుధవారం ఉదయం ప్రారంభమైన వర్షం సాయంత్రం వరకు చిన్నగా కురిసిన వాన జల్లులు సాయంత్రం కల్లా భారీ వర్షంగా మారింది.గురువారం తెల్లవారుజామున అతి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు కోసి కళ్ళల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్ళముందే వర్షార్పణం అవుతుంటే రైతు కంట కన్నీరు వస్తుంది. భారీ వర్షం మూలంగా వస్తున్న వరద నీటితో కల్లాల్లో ఉన్న పంటను కాపాడుకోలేక, కళ్ళముందే పంట కొట్టుకుపోతుంటే ఏమి చేయాలని పరిస్థితి రైతుకు నెలకొంది.వరుణుడి బీభత్సంతో మోకాళ్ల నీటిలో మునిగిన పొలాలు, తడిసిన వడ్లు రైతుల గుండెల్లో మంట రేపుతున్నాయి. అధికారులు పంట నష్టాన్ని నమోదు చేసి, ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
బషీరాబాద్ లో వరద ప్రవాహానికి పంట నష్టం…
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కాడి చెరువు అలుగు పారింది. అలుగు నీరు పొంగి కోతకు వచ్చిన పంట పొలాలను పూర్తిగా నీట ముంచేసింది. చెరువు కింద పంట పొలాలు మొత్తం నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పంట నష్టానికి తగిన నష్టపరిహారం అందజేసి, తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
కోనాపూర్ లో కొట్టుకుపోయిన పంట…
మండలంలోని కోనాపూర్ లో బుధవారం రాత్రి నుండి కురిసిన అకాల వర్షానికి రైతులు కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. రాళ్లవాగు సమీపంలోని కల్లాల్లో రైతులు కోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులోని నీరు కల్లాల్లోకి మల్లడంతో వరి ధాన్యం కొట్టుకుపోవడంతో పాటు ధాన్యంపై ఇసుక మేటలు వేసాయి.
తడిసిన ధాన్యం రాశులు…
మండలంలోని ఉప్లూర్, అమీర్ నగర్, హాస కొత్తూర్ గ్రామాల్లో రైతులు కల్లాల్లో వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. వర్షం పడుతుండడంతో రైతులు ముందు జాగ్రత్త ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పిలిన్ కవర్లు కప్పి ఉంచారు. భారీ వర్షం మూలంగా వచ్చిన వారగా నీటితో కుప్పల క్రింద వరి ధాన్యం తడిసి ముద్దయింది.ఉప్లూర్ లో పలువురు రైతుల కోయని వరి పొలాలు నేలవాలాయి. కోతకు వచ్చిన పొలాలు అకాల వర్షాలతో దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ సిబ్బంది…
మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. వర్షం కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించినట్లు తెలిపారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం మండలంలో వరి కోతలు కోయని పంట సుమారు 950 ఎకరాల్లో, దాదాపు 350 మంది రైతులు నష్టాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పటికే కోసిన వరి ధాన్యం సుమారు 200 మంది రైతులకు సంబంధించి దాదాపు 1500 క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు నిర్ధారించినట్లు వివరించారు. పంట నష్టం వివరాలను అధికారులకు పంపిస్తున్నామని, ఇంకా క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ కొనసాగుతోందని తెలిపారు. పూర్తి సమాచారం అందిన తర్వాత తగిన చర్యలు చేపట్టనున్నట్లు మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ వెల్లడించారు.



