– ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలి 
– తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
– పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి 
నవతెలంగాణ -పెద్దవంగర: మొంథా తుపాను నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తుపాను ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పెద్దవంగర చెరువు అలుగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, అధికారులతో కలిసి వరద ఉధృతిని గురువారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మొంథా తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటికి రావాలన్నారు. 
రాష్ట్ర ప్రజల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు ఉండాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు, చెరువులు, కాల్వ గట్లు కోతకు గురైతే తక్షణమే యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, భవనాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. అకాల వర్షాలకు పంటలు నీట మునిగిపోయినవని, రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షపు నీరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు మురళి, సైదులు, సతీష్, శ్రీనివాస్, సీతారాం, రవీందర్ రెడ్డి, మధన్ మోహన్ రెడ్డి, హరికృష్ణ, లింగమూర్తి, సమ్మయ్య, దేవేంద్ర, మంజుల, వినోద్, సంపత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు..

 
                                    