నవతెలంగాణ – ఆర్మూర్
బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు కురిసిన అకాల వర్షాలతో మండలంలోని పలు గ్రామాలతో పాటు ఆలూర్, నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. తుఫాను ప్రభావంతో మండల వ్యాప్తంగా కురిసిన జోరు వాన కారణంగా ఇప్పటికే కోతకొచ్చిన పంటలు నేలరాలిపోయి నీటమునిగాయి. ధాన్యం కుప్పలు తడిసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలూర్ మండలంలోని కల్లెడి, రాంచంద్రపల్లి గ్రామంలో తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో గంగాధర్, ఆర్ ఐ రేణుక స్వయంగా పరిశీలించారు.
గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం నిల్వలను, తడిసిన కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. రైతులు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంట నష్టం అంచనా వేసి తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
మునిగిన పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి ..
మండలంలోని మగ్గిడి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఏం. గోవింద్ మునిగిన పంటలను గురువారం పరిశీలించారు. గత రాత్రి కురిసిన వర్షాలతో గ్రామంలో వరి పంట నీట మునిగినట్టు గమనించారు డి.ఏ.ఓ గారు రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని తక్షణ నివేదికలు సమర్పించాలని ఏ.ఈ.ఓ. కి చెప్పడం జరిగింది. పంటలు నీట మునిగినప్పుడు పొలాల నుండి నీరు తీసివేయాలని, తెగులు రాకుండా నివారించడానికి వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.



