పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఉన్నత విద్యాసంస్థల బంద్ జిల్లాలో చేపట్టారు. గురువారం పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజ్ బాయ్స్ జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సందర్శించి బంద్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమొల్ల కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెట్టి గణేష్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం స్కాలర్షిప్లను చెల్లించకుండా విద్యార్థులను ఉన్నత చదువుకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.
నాలుగేళ్లలో ఎనిమిది వేల కోట్ల మేరకు స్కాలర్షిప్ లు ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్ పడ్డాయని అన్నారు. విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా దీపావళి వరకు రూ. 1200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి మాట తప్పారని అన్నారు. ఏళ్ల తరబడి స్కాలర్షిప్పులు రాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆర్థిక భారాలు మోయాల్సి వస్తుంది మరోవైపు బడ్జెట్ కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొన్నది. కావున రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కళాశాలలపై విజిలెన్స్ దాడులకు ఆదేశించడం ప్రభుత్వ అనాగరిక చర్య అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వ విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలను సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పెందుర్ సునీల్, నాయకులు బండు అర్జున్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆశిష్, కిరణ్, మురహరి పాల్గొన్నారు.



