Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆహార కల్తీ నివారణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

ఆహార కల్తీ నివారణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ : ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా కల్తీ ఆహార పదార్థాలను నివారించేందుకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం ఆహార కల్తీ నిరోధక శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హోటళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్, టిఫిన్ సెంటర్స్, ఆహార పదార్థాల విక్రయశాలలు, దుకాణాలు తదితర వాటిని క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగి ఉండే నిజామాబాద్ నగరంతో పాటు, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో తనిఖీలను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే రీతిలో కలుషిత ఆహార పదార్థాలను తయారుచేసే, విక్రయించే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, వసతి గృహాలలో విద్యార్థులకు అందించే భోజన పదార్థాలలో కూడా కల్తీని నిరోధించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించిన సమయంలో వాటిని సీజ్ చేసి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపాలని, వాటి నివేదికల ఆధారంగా కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలు, వ్యాపార సంస్థలు తగిన అనుమతులు కలిగి ఉన్నాయా అన్నది పరిశీలిస్తూ, నిర్ణీత గడువును అనుసరిస్తూ వాటిని రెన్యువల్ చేసుకునేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఆహార కల్తీ గురించి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి దాడులు నిర్వహించాలన్నారు. పూర్తి పారదర్శకంగా, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారిణి సునీత తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -