కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటాం 
బకాయిలు అడిగితే విద్యాసంస్థల్లో విజిలెన్స్ దాడులతో బెదిరిస్తారా? సీఎం హామీని అమలు చేయాలి
14 లక్షల మంది పేద విద్యార్థుల గోస ప్రభుత్వానికి వినపడదా ? సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాలలు, యూనివర్సిటీలు బంద్
హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అరెస్టులు.. ఖండించిన రాష్ట్ర కమిటీ
హైదరాబాద్‌లో నారాయణగూడ నుంచి వైఎంసీఏ వరకు భారీ ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించడంతో 23 నెలలుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు పెండింగ్ ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్స్ కోసం రోడ్డెక్కారు. అయినా ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయకుండా ఇంకా జఠిలం చేస్తుండటంతో వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంత మైంది. బంద్ అనంతరం హైదరాబాద్‌లో నారాయణగూడ నుంచి వైఎంసీఏ సర్కిల్ వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజులు మాట్లాడారు. 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ఫీజులు కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. గత ప్రభుత్వం బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి అవి చెల్లించకపోగా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలు సైతం విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపి రూ.1,200 కోట్లను దసరాకు రూ.300 కోట్లు, దీపావళికి రూ.900 కోట్లు, నవంబర్‌లో మరో రూ.300 కోట్లు ఇస్తామని హామీ మాత్రమే ఇచ్చిందని, అమల్లోకి తీసుకురాకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు.
రాష్ట్రంలో ఫీజులను చెల్లించాలని అడిగిన ప్రతీసారి విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేస్తున్నారన్నారు. వీటి వల్ల విద్యాసంస్థలే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వద్దనేలా చేసి, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం ఫీజులను చెల్లించి సమస్యను పరిష్కరించాలనీ, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు కట్టుబడి ఉన్నామంటున్న రేవంత్‌రెడ్డి నిర్బంధం ప్రయోగించి బంద్‌ను అణచివేయాలని ప్రయత్నించడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. 
తక్షణమే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగంలో అడుగడుగునా సమస్యలున్నాయని.. పరిష్కరించాల్సిన రాష్ట్ర సర్కారు నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు. ఫీజులను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.హైదరాబాద్ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరాను బస్సులు అడ్డుకుంటుండగా, ఉస్మానియాలో బంద్ చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోలీసులు నిర్బంధం ప్రయోగించారనీ, ఈ అక్రమ నిర్బంధాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ భారీ ప్రదర్శనలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు స్టాలిన్, నాగేందర్, మనోజ్, ఆంజనేయులు, శివ గణేష్, కార్తీక్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 
                                    