Friday, November 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుముంచిన మొంథా

ముంచిన మొంథా

- Advertisement -

దెబ్బతిన్న పంటలు
పత్తికి భారీ విపత్తు
కన్నీరు పెట్టుకుంటున్న రైతులు
కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోంచి కొట్టుకుపోయిన ధాన్యం
మంత్రులు, అధికారులు, నాయకుల భరోసా
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీపీఐ(ఎం) నేతలు

రైతులను ‘మొంథా’ ముంచేసింది. భారీ వర్షాలకు చేతికొచ్చిన ధాన్యం వరదపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. కాపాడుకునేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నించి సరిపడా టార్ఫాలిన్లు లేక.. విఫలమై కన్నీరు పెట్టుకుంటున్నారు. పండించిన పంట కండ్ల ముందే కొట్టుకుపోతున్నా రైతులు అచేతనంగా నిలబడిపోయారు. ఎన్నో అష్టకష్టాలు పడి చివరకు అమ్మకానికి పెట్టిన పంట వరద నీటిపాలవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గురువారం ఎండకు ఆరబోస్తుండగా బూజుపట్టిన ధాన్యం బయటపడింది.

పత్తి రైతుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. చేతికందాల్సిన పత్తి నల్లబారిపోయింది. ఇంకా కోయాల్సిన వరి, పత్తి పైర్లు వరద నీటిలోనే ఉన్నాయి. ఈ తుఫాను రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సీపీఐ(ఎం) నాయకులు పొలాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. సత్తుపల్లి, రఘునాదపల్లి, ముదికొండ, నల్లగొండ జిల్లాలో పంటలను సీపీఐ(ఎం) నేతలు పరిశీలించారు.

నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదలతో అన్నదాతలు కుదేలయ్యారు. అనేక చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. ప్రాజెక్టుల్లో వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు చోట్ల మరణాలు సంభవించాయి. పశువులు భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. కరీంనగర్‌ జిల్లాలో సుమారు 2036 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసినట్టు అధికారులు అధికారికంగా అంచనా వేశారు. కానీ వాస్తవంగా దాదాపు 50వేల మెట్రిక్‌టన్నులకుపైగా ధాన్యం తడిసినట్టు ఆయా మండలాల నుంచి నివేదికలు వస్తున్నాయి. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిలాల్లో కూడా అధికారులు అధికారికంగా 2వేల నుంచి 2500 మెట్రిక్‌టన్నుల ధాన్యానికి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా నివేదికను కలెక్టర్లకు పంపారు.

బుధవారం నాటి భారీ వర్షానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటికే ప్రారంభించిన 120 కొనుగోలు కేంద్రాల్లో సుమారు లక్షకుపైగా మెట్రిక్‌టన్నుల ధాన్యం చేతికొచ్చే పరిస్థితి లేదు. గురువారం ఉదయం నుంచి ఎండ కొడుతుండటంతో ఆరబోస్తుండగా అక్కడక్కడా బూజు వచ్చిన పరిస్థితీ కనిపించింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని బుడగజంగాల కాలనీ, ఎస్సీ కాలనీ ఇండ్లలోకి వరద నీరు చేయడంతో బురదమయం అయ్యాయి. కరీంనగర్‌ జిల్లా శివారులోని మల్కాపూర్‌ పరిధిలోని శ్రీలక్ష్మిహోమ్స్‌కాలనీ నీట మునగడంతో కాలనీవాసులు రోడ్డుపై బైటాయించారు. అధికారులకు వారిని సముదాయించడంతో ధర్నా విరమించారు.

రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర పంట నష్టం జరిగింది. రెండ్రోజుల పాటు కురిసిన వర్షానికి 48 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. సుమారు 466 ఎకరాల్లో 311 మంది రైతుల పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు గుర్తించారు. వికారాబాద్‌ జిల్లాలో 13 మండలాల పరిధిలోని 144 గ్రామాల్లో 3,550 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 3,177 మంది రైతులు నష్టపోయారు. కల్వకుర్తి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా..
నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని చొప్పరి రామకృష్ణ వరి పొలాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. తిమ్మాజిపేట మండలంలో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి కమల్‌కుమార్‌ పరిశీలించారు. వివిధ గ్రామాలలో చెరువుల కింద ఆయకట్టు పొలాల్లో తిరుగుతూ దెబ్బతిన్న పంట పొలాల వివరాలను గుర్తించారు. పత్తి 475 ఎకరాలు, వరి పంట 131 ఎకరాలు పాడైపోయినట్లు తెలిపారు.

అచ్చంపేట నియోజకవర్గంలో వర్షం ప్రభావం 67 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. పాడి పశువులు వరద నీటిలో కొట్టుకపోయి మృత్యువాతపడ్డాయి. విద్యుత్‌ శాఖకు పెద్దఎత్తున నష్టం జరిగినట్టు విద్యుత్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. బల్మూరులో సీపీఐ(ఎం) నాయకులు పంట పొలాలను పరిశీలించారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండల పరిధిలోని గ్రామంలో వర్షాలకు పంటలు నష్టపోయిన వరి, వేరుశనగ, మినుములు, ఉల్లి,పంటలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బృందం పరిశీలించింది.

సిద్దిపేటలో..
సిద్దిపేట జిల్లాలో రాయపోల్‌ మండల పరిధిలో రైతులు వేసిన మొక్కజొన్న, మిరుదొడ్డి, అక్బర్‌ పేట భూంపల్లి మండలంలో ఎక్కువగా వేసిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దైంది. కొమురవేల్లి మండలం పరిధిలో రసులాబాద్‌, అయినాపూర్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో బుధవారం కురిసిన వర్షానికి మద్దూరు మండలంలో 60 ఎకరాలు, దూల్మిట్ట మండలంలో 50.5 ఎకరాల పంట నష్టం జరిగినట్టు ఏవోలు రామకృష్ణ, ఎండి అఫ్రోజు వేరువేరు ప్రకటనలో తెలిపారు. నంగునూరు మండల పరిధిలోని పంట పొలాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి సందర్శించారు. వివిధ గ్రామాల్లో 706 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. హుస్నాబాద్‌, పందిళ్ళ, మీర్జాపూర్‌, మహమ్మదాపూర్‌ నాలుగు క్లస్టర్‌లో వ్యవసాయ శాఖ అధికారులు 1500 ఎకరాలలో వరి పంట నష్టం, 600 ఎకరాలను పత్తి పంట నష్టపోయినట్టు తెలిపారు.

భద్రాద్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తుపాన్‌ ప్రభావం వల్ల దెబ్బతిన్న వరి, పత్తి పంటలను పరిశీలించారు. తంగెళ్ల తండకు చెందిన రైతు గాంధీ పత్తి పంటను పరిశీలించారు.

నిజామాబాద్‌లో ధాన్యంపై ఇసుక
నిజామాబాద్‌ జిల్లాలో కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. బషీరాబాద్‌ గ్రామంలో అలుగు నీరు పొంగి కోతకు వచ్చిన పంట పొలాలు నీట మునిగాయి.కోనాపూర్‌లో కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. రాళ్లవాగు సమీపంలోని కల్లాల్లో రైతులు కోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులోని నీరు కల్లాల్లోకి మల్లడంతో వరి ధాన్యం కొట్టుకుపోవడంతోపాటు ధాన్యంపై ఇసుక మేటలు వేసాయి. ఉప్లూర్‌, అమీర్‌నగర్‌, హాసకొత్తూర్‌ గ్రామాల్లో రైతులు కల్లాల్లో వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. బాల్కొండ మండల పరిధిలో కోతకొచ్చిన పంటలు నేలరాలిపోయి నీటమునిగాయి.

ఎకరానికి దాదాపు 50 వేల నుంచి 60 వేల రూపాయల వరకు నష్టం సంభవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిరికొండ మండల మండల కేంద్రంలో వరి పంట నేలకొరిగింది. కొండూరు గ్రామంలో 400 వరి బస్తాలను తూకం వేసి ఉంచగా.. లారీ అందుబాటులో లేకపోవడంతో ధాన్యపు బస్తాలను తరలించలేదు. తిరిగి బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి వరి బస్తాలు అడుగు భాగం వర్షంలో తడిసిపోవడంతో వాటిని చూసిన రైతు సంతోష్‌ కన్నీటి పర్యంతమయ్యారు. జానకంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు.

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం
మొంథా తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో ఖమ్మంలోని మున్నేరువాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్‌, బొక్కలగడ్డ కాలనీల్లో వరద చేరింది. ప్రస్తుతం నీటిమట్టం 24.76అడుగులకు చేరింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్డి సూచించారు.

మూడో ప్రమాద హెచ్చరికతో 25 అడుగుల మేరకు ఖమ్మం కాల్వొడ్డు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు ప్రవాహాన్ని గురువారం నగర మేయర్‌ పునకొల్లు నీరజ, అదనపు కలెక్టర్‌ పి. శ్రీజ, మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యతో కలిసి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. మున్నేరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి ధంసలాపురం పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌, నయాబజార్‌ కళాశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఖమ్మంలోని రాపర్తినగర్‌ బీసీ కాలనీ వద్ద డంపింగ్‌ యార్డుకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. పాలేరు జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది.

వరంగల్‌లో మంత్రి, ఎంపీ పర్యటన
వరంగల్‌తోపాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ నీటి మునిగిన కాలనీలలో పర్యటించి బాధితులను పరామ ర్శించారు. ఎంపీ కడియం కావ్య హన్మకొండ ప్రాంతాల్లోని ఎస్సార్‌నగర్‌, బీఆగర్‌ నగర్‌లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.

పలువురి మృతి
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామశివారులో అప్పని నాగేంద్రం (48)అనే వ్యక్తి మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా కాశిబుగ్గ ప్రాంతం ఎస్సార్‌నగర్‌ కాలనీకి చెందిన అడప కృష్ణ (70) వరదనీటిలో మృతిచెందాడు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల పరిధిలో ద్విచక్ర వాహనంపై గరిమిళ్ల-కంబాల గ్రామాలో మధ్య ఉన్న లోలెవల్‌ వంతన దాటుతుండగా యువకుడు గల్లంతై మృతిచెందాడు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో గూడ కూలి వృద్ధురాలు మృతిచెందారు. డోర్నకల్‌ మండలంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చి నీళ్లలో పడి మరో మహిళ మృతిచెందారు.

ప్రాజెక్టుల పరిస్థితి
మధ్యమానేరు ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం నుంచి మానేరు, మూలవాగు, వరదల కాలువల ద్వారా 10వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు 5175క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. ఆ నీరు దిగువన లోయర్‌మానేరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. ఈ ఎల్‌ఎమ్‌డీలోకి మోయతుమ్మెద నుంచి మరో 4వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టు 12గేట్లు ఎత్తి దిగువకు 12వేల క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎస్సారెస్సీ నుంచి లక్ష క్యూసెక్కులు వరద వస్తుండగా.. పరివాహక ప్రాంతాల నుంచి లక్షా 14వేల క్యూసెక్కులు డ్యాంలోకి చేరుతోంది. ప్రాజెక్టులోని 62గేట్లకుగాను 23గేట్లు ఎత్తి దిగువకు లక్షా 12వేల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.175టీఎంసీల సామర్థ్యానికిగాను 18టీఎంసీల నీరు నిల్వను కొనసాగిస్తున్నారు.

వరంగల్‌లో మళ్లీ…
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమయ్యాయి. వరి, పత్తి, మక్కలు, అరటి, కూరగాయల సాగుకు తీవ్ర నష్టం కలిగింది. హన్మకొండ నగరంలోని గోపాల్‌పూర్‌ ఊర చెరువు గేట్లను తెరవకపోవడంతో గండి పడి పెద్ద ఎత్తున వరద కాలనీలపై పడడంతో ఇండ్లలోకి వరద ప్రవేశించింది. ఊర చెరువు గేట్లను ముందే తెరిచి వుంటే ఇంత భారీ నష్టం సంభవించేది కాదని బాధితులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్‌ నగరంలో 30, హన్మకొండలో 15 మొత్తంగా 45 కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి.

వాగులో జల దీక్ష
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపుర్‌ మండలం, రామాపురం గ్రామంలో వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని సామాజిక నాయకులు ఆకునమోని చంద్రయ్య యాదవ్‌ వాగులో జలదీక్ష చేపట్టారు. ఈ జలదీక్షకు గ్రామ యువకులు సంఘీభావం ప్రకటించారు.

అధ్వానంగా గ్రామీణ రోడ్లు
మొంథా తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ఛిద్రమయ్యాయి. రాష్ట్రంలో 230 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. కల్వర్టులు, బ్రిడ్జీలు తెగిపోవడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. చాలా ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోని గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి తుఫాను ప్రభావంతో మరింత అధ్వానంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రహదారుల పరిస్థితి ఇలానే ఉంది. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్‌ పరిధిలోని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి కూడా ధ్వంసమైంది. డిండి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వరద తాకిడికి రహదారికి కోత ఏర్పడి కల్వర్టు పూర్తిగా తెగిపోయింది. ఫలితంగా రెండు వైపులా వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

మంత్రి పొన్నం పర్యటన
కరీంనగర్‌ జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని సైదాపూర్‌, చిగురుమామిడి మండలాల్లో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పర్యటించారు. సైదాపూర్‌ ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఇందుర్తి – కోహెడ మధ్య లోలెవల్‌ వంతెపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తూ చుట్టుపక్కల సుమారు 2కిలోమీటర్ల మేర ఇసుక మేటలు వేసిన పొలాల రైతులతో మంత్రి మాట్లాడారు.

సీపీఐ(ఎం) నేతల పరిశీలన..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో నెలకొరిగిన వరి పొలాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. రైతులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొంథా తుఫాను వల్ల రైతులకు తీరని అన్యాయం జరిగిందని, పంట నష్టపోయిన రైతులకు పరిహారమందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడెంలో ఐకేపీ కేంద్రాన్ని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి తుమ్మల వీరారెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడారు. మాడుగుపల్లి మండలంలో దెబ్బతిన్న వరిచేలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పరిశీలించారు.

కూలిన ఇండ్లు..
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగీళ్లపూర్‌, తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన కీసర వెంకట్‌, పెండల్‌ చంద్రయ్య ఇండ్లు వర్షానికి కూలినట్టు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తెలిపారు. గురువారం అయా గ్రామాల్లో తహసీల్దార్‌ పర్యటించి కూలిన ఇండ్లను పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -