నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను సవాల్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ నిబంధనను ఎత్తివేతకు ఆదేశాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కు కిందకు రాదని గుర్తు చేసింది. పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 (3) నిబంధనను కొట్టివేతకు నిరాకరించింది. ఈ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అందుకు అనుగుణంగా గవర్నర్ ఆమోదం లభించలేదనీ, ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని చెప్పింది.
ఈ నిబంధన ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన వీరన్న వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్‌బెంచ్ కొట్టివేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాఖలు చేసిన నామిషన్లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడాన్ని సవాల్ చేసిన పిటిషన్లను కూడా డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టుల జోక్యానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పుల మేరకు పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. నామినేషన్ల తిరస్కరణపై ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చునని సూచించింది.
హెచ్‌ఆర్‌సీ ఉత్తర్వులపై స్టే
విద్యార్థుల సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు షరతులు విధించకుండా ఇవ్వాలంటూ పలు కాలేజీలకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఆదేశాలను జారీ చేసింది. కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ, సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలు హెచ్‌ఆర్‌సీ యాక్ట్‌లోని సెక్షన్ 2(డీ) పరిధిలోకి రావని చెప్పి స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. కౌంటర్ వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యార్థులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.
ఇద్దరు పిల్లల నిబంధనపై పిటిషన్ డిస్మిస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



