Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంపరిహారం చెల్లింపులో సాకులొద్దు

పరిహారం చెల్లింపులో సాకులొద్దు

- Advertisement -

సాంకేతిక కారణాల చెప్పి బీమా ఆపకూడదు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


న్యూఢిల్లీ : పరిహారం చెల్లింపు విషయంలో సాకులు వెతకొద్దని బీమా కంపెనీల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రూట్‌ పర్మిట్‌ ఉల్లంఘన వంటి సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారం నిరాకరించడం సరికాదని తెలిపింది. ఓ ప్రమాదంలో బాధితుడి తప్పిదం లేదని.. అలాంటప్పుడు ఆయనకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు సంబంధిత పరిహారాన్ని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సమర్థనీయమని వెల్లడించింది.

కర్నాటకలో అక్టోబర్‌ 7, 2014లో జరిగిన ఓ ప్రమాదంలో వేగంగా వచ్చిన ఓ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ కేసులో బాధితుడికి వడ్డీతో కలిపి రూ.18.86లక్షల పరిహారం ఇవ్వాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. ఈ పరిహారం సరిగ్గా లెక్కించలేదని పిటిషనర్‌, మరోవైపు ప్రమాదానికి కారణమైన వాహనం రూట్‌ పర్మిట్‌ను ఉల్లంఘించిందని బీమా కంపెనీ ఆరోపిస్తూ అక్కడి హైకోర్టును ఆశ్రయిం చాయి. విచారించిన హైకోర్టు బాధితుడికి పరిహారం చెల్లించాల్సిందేనని బీమా సంస్థకు స్పష్టం చేసింది. అయితే, దానిని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకునేందుకు అనుమతిచ్చింది.

దీనిని సవాలు చేస్తూ బీమా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు రికవరీకి వీలు కల్పించడాన్ని సవాలు చేస్తూ వాహన యాజమాని కూడా సుప్రీంకు వెళ్లారు. విచారించిన జస్టిస్‌ సంజయ్ కరోల్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ రెండు అప్పీళ్లను తోసిపుచ్చింది. సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారం నిరాకరించడం సరికాదని, అది సహజ న్యాయ భావనకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాధితుడికి పరిహారం చెల్లించాలని, దాన్ని యజమాని నుంచి రికవరీ చేసుకోవడం సమర్థనీయమేనని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -