అభరణాల అమ్మకాల్లో 31 శాతం పతనం
న్యూఢిల్లీ : అధిక బంగారం ధరలు ఆ లోహం డిమాండ్‌ను భారీగా దెబ్బతీశాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బంగారం డిమాండ్‌లో 16 శాతం క్షీణతతో 209.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గురువారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఆభరణాల డిమాండ్ పరిమాణంలో 31 శాతం క్షీణత చోటు చేసుకుంది. మరోవైపు నాణేలు, బార్ల కోసం పెట్టుబడి డిమాండ్ 20 శాతం పెరిగింది.
అభరణాల డిమాండ్ 31 శాతం పతనమై 117.7 టన్నులుగా నమోదయ్యింది. అధిక ధరల నేపథ్యంలో ప్రజలు తక్కువ బరువు, తక్కువ స్వచ్ఛత కలిగిన అభరణాలను కొనుగోలు చేశారు. ఏడాదికేడాదితో పోల్చితే సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు 37 శాతం పతనమై 194.6 టన్నులుగా నమోదయ్యింది. రీసైక్లింగ్ 7 శాతం తగ్గి 21.8 టన్నులుగా చోటు చేసుకుంది. వినియోగదారులు తమ పసిడిని నిలకడగా పెట్టుకోవడమే రీసైక్లింగ్ తగ్గడానికి కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది.
”పెట్టుబడుల డిమాండ్ 74 శాతం పెరిగి 91.6 టన్నులుగా నమోదయ్యింది. ఈ విలువ రూ.88.970 కోట్లుగా ఉంటుంది. పసిడిపై దీర్ఘకాలంలో ఉన్న మక్కువ, విలువను దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లు జరిపారు.” అని డబ్ల్యూజీసీ ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు. ‘స్వల్పకాలంలో బంగారం ధరలు రూ.1,18,000 నుండి రూ.1,24,500 మధ్య అస్థిరంగా ఉండొచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతీన్ త్రివేది తెలిపారు. 
ధనతేరస్, దీపావళి సమయంలో వినియోగదారుల రాక సుమారు 15 శాతం పెరగడంతో డిసెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ కోలుకుంటుందని బులియన్ వర్గాల అంచనా. గురువారం 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,620గా నమోదయ్యిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది. ఇంతక్రితం రోజు రూ.1,19,350గా పలికిందని పేర్కొంది. ఇటీవల బంగారం ధరలు ఓ దశలో ఆల్‌టైం రికార్డ్ గరిష్టాలను తాకిన విషయం తెలిసిందే. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1.32 లక్షలకు చేరి వినియోగదారులను హడలేత్తించిన విషయం తెలిసిందే.
పసిడి డిమాండ్‌కు ధరల సెగ
- Advertisement -
- Advertisement -

 
                                    