Friday, October 31, 2025
E-PAPER
Homeజాతీయంముంబయిలో కలకలం

ముంబయిలో కలకలం

- Advertisement -

17 మంది చిన్నారులను బంధించిన దుండగుడు
చాకచక్యంగా రక్షించిన పోలీసులు
ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం

ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో పట్టపగలే చిన్నారులను బంధించిన ఘటన గురువారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు సకాలంలో స్పందించి రెస్యూ ఆపరేషన్‌ను చాకచక్యంగా చేపట్టి బాలలను రక్షించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారు. పోలీసులు, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ముంబయి పవయీ ప్రాంతంలోని ఆర్‌ఎ యాక్టింగ్‌ స్టూడియోలో రోహిత్‌ ఆర్య అనే వ్యక్తి గత నాలుగైదు రోజులుగా ఆడిషన్స్‌ను నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 8-14 ఏళ్ల వయసులోపు ఉన్న 100 మంది చిన్నారులు స్టూడియోకు వచ్చారు. కొంత సమయం తర్వాత చిన్నారులను బయటకు పంపించిన రోహిత్‌.. కొంత మందిని మాత్రం బంధించాడు.

దీంతో భయాందోళనలకు గురైన పిల్లలు స్టూడియో కిటికీల నుంచి సాయం కోసం కేకలు వేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. నిందితుడికి సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని విడిచి పెట్టేందుకు అతడు నిరాకరించాడు. చిన్నారులకు హాని కలిగిస్తానని బెదిరించడంతో అప్రమత్తమైన రెస్క్యూ బందం.. బాత్‌రూమ్‌ ద్వారా లోనికి ప్రవేశించి 17 మంది చిన్నారులు సహా 19 మందిని రక్షించింది. రెస్క్యూ ఆపరేషన్‌ సమయంలో నిందితుడు కాల్పులు జరిపాడని, దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎయిర్‌గన్‌, కొన్ని రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్య బదులు ప్లాన్‌ మార్చా : వీడియోలో నిందితుడు
ఒక వైపు పోలీసులు పిల్లను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా అదే సమయంలో నిందితుడు రోహిత్‌ ఆర్య ఒక వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ‘ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..కానీ ఆ తర్వాత బలవన్మరణానికి బదులు మరో ప్లాన్‌ ఆలోచించా. అందుకే ఈ చిన్నారులందరినీ బంధించా. నేనేమీ ఉగ్రవాదిని కాదు. డబ్బులూ అక్కర్లేదు. కానీ, కొందరితో మాట్లాడాల్సివుంది. వారి నుంచి సమాధానాలు తెలుసుకోవాల్సివుంది’ అని అతడు వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. దీనినిబట్టి అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -