రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్
మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరిక
ఓయూలో విద్యార్థి నాయకుల అరెస్ట్
నవతెలంగాణ-విలేకరులు
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతమైంది. సమస్యలను తక్షణం పరిష్కరించకుంటే మంత్రులను అడ్డుకుంటామని విద్యార్థి నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం ఫీజులు విడుదల చేయనందున కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో తొలుత యూనివర్సిటీ పీజీ కళాశాల వద్ద నుంచి ఎస్సార్ అండ్ బిజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లాలో మంత్రులను అడ్డుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలంలోని వివిధ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించారు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచలో బంద్ చేపట్టారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. శేరిలింగంపల్లిలో ఇంటర్, డిగ్రీ కాలేజీలను బంద్ చేయించారు. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కాలేజ్ గేట్ ఎక్కి కాలేజీలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా.. సిబ్బంది అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. షాద్‌నగర్, చేవెళ్లలో కళాశాలను బంద్ చేయిం చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా ర్యాలీ చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఆదిలాబాద్ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజ్ బార్సు, బాలికల జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను సందర్శించి బంద్ చేశారు. 
తాంసి, తలమడుగు మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలను బంద్ చేయించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కళాశాలలను బంద్ చేయించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బంద్‌కు డీవైఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌ఎల్. మూర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని ఇప్పటి వరకు ఒక్క రూపాయైనా విడుదల చేయలేదన్నారు. కనీసం రూ.1,200 కోట్లైనా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ ఉపాధ్యక్షులు మన్చాల కిరణ్‌కుమార్, జాయింట్ సెక్రటరీ మనోజ్, నాయకులు రితేష్, రాణా, కార్తిక్, కౌశిక్, ధరణిధర్ తదితర విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 
మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ గేటు ముందు ఎస్‌ఎప్‌ఐ నాయకులు నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలలను బంద్ చేశారు. అచ్చంపేట, కల్వకుర్తి మండలంలోనూ కళాశాలలు బంద్ అయ్యాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలో, మాగనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రయివేటు, డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలను బంద్ చేశారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కళాశాలలు మూతపడ్డాయి. జహీరాబాద్ పట్టణంలో డిగ్రీ, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ కాలేజీలను బంద్ చేశారు.

 
                                    