తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలి : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవాలనీ, తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆయన విమర్శిం చారు. మొక్కజొన్న పంట నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిందనీ, రోడ్లు అనేక చోట్ల తెగిపోయాయని తెలిపారు. మక్కలను క్వింటాల్‌కు రూ.2,400 ఇవ్వాల్సీ ఉండగా రూ.1,800 కూడా రావడం లేదని తెలిపారు. 
11 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి కనీసం 11 వేల టన్నులు కూడా కొనుగోలు చేయలేదని ఎద్దేవా చేశారు. సోయాబీన్ ఒక క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదనీ, తేమ శాతం 11కు తగ్గించడంతో ఏ రైతు పత్తి పంటను కొనుగోలు చేయడం లేదని చెప్పారు. తేమ శాతం 17 ఉన్నా కొనుగోలు చేసేలా సీసీఐ ని రాష్ట్రప్రభుత్వం ఒప్పించాలని కోరారు. వరి ధాన్యం కొనుగోలుకు ఇంకా 4 వేల కేంద్రాలు ఇంకా తెరవలేదనీ, చాలా మంది మిల్లర్లతో ఇంకా కొనుగోలు ఒప్పందాలు కూడా జరగలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక ధాన్యం తడిసిపో యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగాం జిల్లా నర్మెట్టలో 80 మేకలు వరదల్లో కొట్టుకుపోయాయనీ, అనేక విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయనీ, హన్మకొండలో 125 కాలనీలు నీట మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సీఎం సినిమా వాళ్లతోనూ, మంత్రులు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ మునిగిపో యారని విమర్శించారు. ప్రజా సంపదను కాంట్రా క్టర్లకు దోచిపెడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగాంలో రూ.95 లక్షలతో పూర్తయ్యే గానుగ పాడు బ్రిడ్జ్‌ను రిపేర్ చేయని అసమర్ధుడు మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అని విమర్శించారు. ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుం టే సీఎం, మంత్రులు ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో వాగులో డీసీఎం డ్రైవర్ కొట్టుకుని పోయారనీ, డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గం మధిరలో ప్రజలు ఆందోళనకు దిగారని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు రామచంద్రు నాయక్, పల్లె రవి కుమార్, బీఆర్‌ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.

 
                                    