జూబ్లీహిల్స్‌లో రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రచార హోరు
నేటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ రోడ్ షో, సభలు
వెంగళ్‌రావు నగర్ నుంచి ఒకరు..షేక్ పేట్ నుంచి మరొకరు..!
బీజేపీ బైక్ ర్యాలీలకు ప్లాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ డివిజన్‌లోని అన్ని ప్రాంతాలనూ చుట్టేసేందుకు ప్రణాళికలు రెడీ చేశాయి. రోజుకో డివిజన్‌లో రోడ్డు షోలు, బహిరంగ సభలతో ప్రచారం ముమ్మరం చేయనున్నాయి.
రెండు విడతల్లో సీఎం రోడ్ షో
సీఎం రేవంత్‌రెడ్డి నేటి నుంచి ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుని.. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా ప్రజలను కలువనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించనున్నారు. ఇప్పటికే మంత్రులకు సైతం డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించి సమన్వయంతో ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మొత్తం రెండు విడతల్లో సీఎం రోడ్డు షోలు ఉండనున్నాయి. తొలి విడతగా శుక్రవారం, శనివారం రోడ్ షోలో పాల్గొంటారు. రెండో విడతగా నవంబర్ 4, 5వ తేదీల్లో ఆయన రోడ్డు షోలు ఉంటాయి. ఈ పర్యటనలో వెంగళరావునగర్, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ సహా నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను సీఎం చుట్టేస్తారు. వచ్చే నెల 8న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆరు డివిజన్‌లలో బైక్ ర్యాలీలు, 9వ తేదీన షేక్‌పేట్‌లో బైక్ ర్యాలీతో ప్రచారాన్ని ముగించనున్నారు.
షేక్ పేట్ నుంచి కేటీఆర్ రోడ్ షో
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. నేటి నుంచి వచ్చేనెల 9 వరకు ప్రతిరోజూ రోడ్డు షోలు నిర్వహించేలా ఆ పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. నియోజకవర్గంలోని అన్ని మున్సిపల్ డివిజన్‌లలో ఆయన పర్యటిస్తారు. షేక్‌పేట్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, బోరబండ, సోమాజిగూడ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ డివిజన్లలో కేటీఆర్ రోడ్డు షోలు జరగనున్నాయి. ప్రచారానికి ముగింపుగా నవంబర్ 9న షేక్‌పేట నుంచి బోరబండ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రచారంలో భాగంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తమ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీ అధినేత కేసీఆర్ పేరు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటంతో, ఆయన కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఢిల్లీ తరహాలో బీజేపీ ప్రచారం
ఉపఎన్నికలో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ వంటి ముఖ్య నేతలు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పోటీగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ‘కార్పెట్ బాంబింగ్’గా పిలుస్తున్న ఢిల్లీ తరహా వ్యూహంతో..ఒకే రోజు 50కిపైగా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరోసారి ఈ తరహా ప్రచారాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తుండగా.. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద సంఖ్యలో సీనియర్ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. 
ఈ దూకుడు ప్రచారాన్ని పోలింగ్ తేదీ సమీపించే వరకు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రోడ్డు షోలకు దీటుగా బీజేపీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు వచ్చే నెల 2 నుంచి బైక్ ర్యాలీలను ప్రారంభించాలని యోచిస్తోంది. పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు, ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఈ ర్యాలీలు దోహదపడతాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలో కూడా బీజేపీ వివిధ సందర్భాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించింది. మొత్తానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల ప్రచార హోరుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

 
                                    