నవతెలంగాణ – రాయపర్తి: రాయపర్తి ఎంపీడీఓపై వెళ్లివెత్తిన ఆరోపణ నిరాధారమైందని వివిధ గ్రామాల కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వహిస్తున్న తూర్పాటి స్వప్న రాయపర్తి ఎంపీడీఓ కిషన్, తోటి సిబ్బంది తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై గురువారం 40 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగున్నర సంవత్సరాలుగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు దిశా నిర్దేశం చూపిన అధికారి ఎంపీడీఓ అని తెలిపారు.
అనుభవం ఉన్న వారికి సలహా సూచనలు తెలుపుతూ విధుల్లో కొత్తగా చేరిన వారిని ప్రోత్సహిస్తూ పని విధానం చెప్పే వారని వివరించారు. ఎంపీడీఓ మహిళ కార్యదర్శులను, సిబ్బందిని గౌరవంగా చూసుకుంటూ పెద్దన్న బాధ్యత వహించేవారని చెప్పారు. టైపిస్ట్ స్వప్న తన వ్యక్తిగత అవసరాల కోసం తోటి సిబ్బందితో ఆర్థికపరమైన లావాదేవీలను పంచుకుందని ఈ విషయంలో ఎంపీడీఓకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క అధికారి దగ్గర నుండి రూపాయి కూడా ఎంపీడీఓ తీసుకున్న దాఖలాలు లేవన్నారు. వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా ఇతరులకు మార్గదర్శిగా ఉండే అధికారిపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో ఏపీఎం కుమార్, కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు బత్తుల నర్సయ్య, కరుణ శ్రీ, గాదె సుమలత, లక్ష్మీ దేవి, జయంతి, రాజు, మహేందర్, శ్రీనివాస్, విజేందర్, రాకేష్, రాజేందర్, పవన్ సాగర్, సత్యనారాయణ, అంబెడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

 
                                    