శరవేగంగా మారిపోతున్న ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశాంగ విధానంలోనూ దౌత్యనీతిలోనూ ఈ చిక్కులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దౌత్యనీతి విదేశాంగ విధానం అంతకంతకూ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిపోవడం జరుగుతున్నది. భారత దేశంలోనైతే ప్రభుత్వం, దాని కార్పొరేట్ మద్దతు దారులు, కార్పొరేట్ బడామీడియా దీని అల్లిక చేస్తున్నారు. అంతులేనంత బిగ్గరగా దాన్ని వినిపిస్తున్నారు. ఈ విధంగా ఈ మొత్తం ప్రయత్నాలు తమ అల్లికలకే బందీలైనట్టు కనిపిస్తుంది.
పహల్గాం టెర్రరిస్టు దాడి తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణ సమయంలో ఇది అత్యంత ప్రస్ఫుటమైంది.
భారత దేశ స్పందన, తర్వాత ఉపసంహరణలను మరెవరో గాక స్వయంగా డోనాల్డ్ ట్రంప్ హైజాక్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటనకు ముందే అమెరికా అధ్యక్షుడు ఇలా జరగబోతున్నదని ప్రకటించారు. అంతటితో ఆగక పుండుమీద కారం చల్లినట్టుగా ట్రంప్ ఈ శతృత్వాలను సమాప్తం చేసిన ఘనత తనదేనన్నారు. అమెరికాతో భారత దేశ వాణిజ్య సమస్యలపై తను బెదిరించినందునే ఈ కాల్పుల విరమణ సాధించగలిగానని కూడా ట్రంప్ చెప్పుకున్నారు. ఈ ప్రకటనల వల్ల మోడీ సర్కారు దేశంలో తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన మాట నిజమే. ఎందుకంటే ద్వైపాక్షిక వివాదాల పరిష్కా రంలో మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌కు సంబంధించి ఎలాంటి మూడో పక్షానికి చోటు వుండరాదన్నది దీర్ఘ కాలంగా భారతదేశం అనుసరిస్తున్న విధానం. ఆ మూలసూత్రమే ఇప్పుడు దెబ్బతినిందన్న భావన ఇందుకు కారణమైంది.
ట్రంప్ పరిష్వంగంలో…
ఇది మోడీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఇబ్బందికరం కావడానికి కారణం కూడా వుంది. ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టినప్పుడు మోడీ తానేదో ఆయనకు అత్యంత సన్నిహితుడనే భావనను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆయన గాఢ కౌగిలింతలు దౌత్యశక్తికి వనరుగా మోత మోగింది. వాషింగ్టన్‌లోని అనేకమంది విదేశాంగ విధానకర్తలు అమెరికాకు వ్యతిరేకంగా వుండటం ప్రమాదకరనీ, ఈ ఉత్తుత్తి కౌగిలింతలే ప్రాణాంతకంగా పరిణమించవచ్చునని చెప్పారు. అయితే మోడీ ప్రభుత్వం, ప్రధానమంత్రి కూడా లెక్కలేనట్టు చెలరేగిపోయారు. దాంతో ట్రంప్ ప్రస్తుత భారత దేశ ప్రభుత్వాన్ని నిర్విరామంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నారనే పేరుతో ట్రంప్ తన టారిఫ్ టెర్రరిజంలో భాగంగా యాభై శాతం అదనపు టారిఫ్ విధించారు. పశ్చిమాసియా, అమెరికాల నుంచి కొంటున్నదానికన్నా చాలా తక్కువకు వస్తున్నందున భారత్ ఈ చమురును కొనుగోలు చేసింది.
చివరకు మోడీ భారత్ వల్లనే రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నదని ఆరో పించే వరకూ వెళ్లారు. ఎందుకంటే రష్యన్ చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ ఆ దేశ యుద్ధ యంత్రాం గానికి నిధులు సమకూర్చిందనేది ఆయన వాదన. ట్రంప్ సర్కారు ప్రారంభించిన టారిఫ్ టెర్రరిజం ఆర్థికాంశాలను దాటి చాలా దూరం వెళ్లిందనేది బాగా స్పష్టం. నిజానికి అది భౌగోళిక రాజకీయ లక్ష్యాలు సాధించుకోవడం కోసం టారిఫ్‌లను ఆయుధాలుగా మార్చుకోవడమే. బ్రెజిల్‌పై అదనంగా యాభై శాతం టారిఫ్‌లు విధించడం మాజీ మితవాద అధ్యక్షుడు జైర్ బోల్సనారోపై చట్టపరమైన కేసులు నడిపించడం కోసమే. రష్యన్ భద్రతకు భంగం కలిగించేందుకు యూరప్ చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందనేది కూడా ఇప్పటికే బయటికొచ్చింది. ఇందుకు అమెరికా నాటోల పూర్తి మద్దతుతోనే ఇది జరిగింది.
బ్రిక్స్ విస్తరణ, నూతన మార్గాలు
ఈ విధంగా ట్రంప్ నాయకత్వంలో అమెరికా చేపట్టిన ఏకపక్ష దురాక్రమణ పోకడల ఫలితం గానే బ్రిక్స్ మరింత సంఘటితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. అదిప్పుడు బ్రిక్స్ ప్లస్‌గా ఇంకా విస్తరిం చింది. బ్రిక్స్ విస్తరణతో వాస్తవానికి పేద దేశాల మధ్య కారిడార్లు, మార్కెట్లు ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్యంలో మార్పులు తెస్తున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య కరెన్సీ వైవిధ్యం వల్ల రవాణాలో సంక్లిష్టత ఏర్పడి షిప్పింగ్ కంపెనీలు ఈ క్రమంలో కేవలం డాలర్ అనే పరిధిని దాటి బహుళ విధాలైన కరెన్సీతో కాంట్రాక్టులు, చెల్లింపులను నిర్వహించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆఫ్రికా లాటిన్ అమెరికాలోనూ పశ్చిమాసియాలోనూ సరఫరా గొలుసు కొత్త రూపం తీసుకుంటున్నది. అమెరికా పట్టును సవాలు చేసే విధంగా కొత్త వాణిజ్య మార్గాలకు దారితీస్తున్నది. బ్రిక్స్ విస్తరణ కేవలం భౌగోళిక రాజకీయ పరిణామం మాత్రమే కాదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఏకధృవ నేతృత్వానికి సవాలు విసిరే సామర్థ్యం దానికి వుంది. ప్రస్తుతం అంతర్జాతీయ ఉత్పత్తిలో జి7 వాటా 28 శాతానికి తగ్గిపోగా బ్రిక్స్ వాటా 35 శాతానికి పెరుగుతున్నది.
తాజాగా రెండు రష్యన్ చమురు కంపెనీల మీద ఆంక్షలను విధించడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. తన టెలిఫోన్ సంభాషణలో ప్రధాని మోడీ రష్యా నుంచి భారత్ చమురు కొనబోదని నిర్ధారిం చారని డోనాల్డ్ ట్రంప్ చెబుతున్న దానిపై భారత పాలక వ్యవస్థ ఎలాంటి నిర్దిష్ట వ్యాఖ్య చేయలేదు. కానీ ప్రభుత్వం తరపున కొంతమంది అజ్ఞాత అధికారులు, అలాగే అంబానీ రిలయన్స్‌కు సంబంధించిన వారు మాట్లాడిన దాన్నిబట్టి చాలా ఒత్తిడిలో వున్నట్టు కనిపిస్తున్నది. ముడిచమురు సరఫరాలతో సంబంధం వున్న ప్రైవేటు శుద్ధి కర్మాగారాలు, అలాగే ప్రభుత్వ రంగ కంపెనీలు, మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల చిల్లర ధరల వ్యవస్థలపై ఈ ఒత్తిడి వుంటున్నది.
వ్యవసాయ రంగం ప్రత్యేకించి ఆహారధాన్యాలు, పాడి ఉత్పత్తుల రంగాలకు కూడా ఈ వేడి సోకుతున్నది. చివరగా జరిగేదేంటో ఈ దశలో మేము నిర్దిష్టంగా చెప్పలేము. అయితే అమెరికా, చైనాలు రెండూ ఒక అంతిమ చట్రంలో కుదుర్చుకున్నాయి. అమెరికా వాణిజ్య కార్యదర్శి స్కాట్ బిసెంట్ అద నంగా మరో రెండు శాతం టారిఫ్‌లు విధించే ప్రసక్తి ఎగిరిపోయిందని చెప్పారు. అమెరికా, చైనా సంప్రదింపులు ట్రంప్, షీ జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశానికి సన్నాహంగా జరిగాయనీ, ఉభయ తారక ఫలితాలు పరస్పర ప్రయోజనాల కోసం చూడవచ్చునని చైనా ఉపప్రధాని హీ లిఫెంగ్ కూడా తెలిపారు.
చైనా అనుభవం-భారత్‌కు పాఠం
వాణిజ్యంలో టారిఫ్‌ల విషయంలో అమెరికా ఆధిపత్య దురాక్రమణను ఎదుర్కోవడానికి చైనా ఎంత పకడ్బందీగా సమాయత్తమైందనే దానిపై ప్రధాన చర్చ కేంద్రీకృతమైంది. తన పరాధీనతను తగ్గించుకోవడం, స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసుకోవడం కోసం చైనా వ్యవహరించడం వాస్తవం. అరుదైన మట్టి నమూనాల ఉత్పత్తిలోనూ అంతర్జాతీయ రక్షణ సెమీ కండక్టర్ పరికరాల తయారీలోనూ చైనా సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు బాగా తెలిసినవే. జీవనగతిని మార్చే కీలక సాంకేతిక రంగాలలో సాధించిన అమోఘ ప్రగతి వాస్తవమే తప్ప కల్పన కాదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చైనా వ్యూహాత్మక స్వతంత్రాన్ని కాపాడుకోవడం కోసం వారు దీర్ఘకాలిక దార్శనికతతో ఎంతో పటిష్టంగా సన్నద్ధమయ్యారు. అమెరికా కజ్జాకోరు పోకడలు, ఏకపక్ష ధోరణుల వల్లనే బ్రిక్స్ ప్రక్రియ సంఘటిత మవుతున్నది.
అందువల్ల భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం ఎలాగూ భారత ప్రజలకు చాలా వ్యతిరేకంగానే తయారవుతుందనేది స్పష్టమే. అయినా ఆ ఒప్పందం అంతిమ ఫలితం కోసం నిరీక్షిస్తూనే మనం, అలాగే దేశ సార్వభౌమత్వం కాపాడుకోవాలని కోరే వారందరూ ట్రంప్ టారిఫ్ టెర్రరిజాన్ని, ఏకపక్ష ఒత్తిళ్లతో పాటు మన ప్రభుత్వ లొంగుబాటును కూడా వ్యతిరేకించాలి. ప్రధానమంత్రి వ్యక్తిగత దౌత్య శైలికి ప్రభుత్వం ఎంతగానో బలవుతున్నది. దౌత్య రంగంలో విదేశీ సంబంధాలలో ఈ వ్యక్తిగత లక్షణాలు పెద్ద ప్రభావం చూపిస్తాయనే భ్రమ పెట్టడంలో జరుగుతున్నది. మన గుడ్లన్నీ ఒకే అమెరికా బుట్టలో పెట్టడం వల్ల మనం కుప్పకూలిపోతున్నాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బహుళ ధృవ రూపం తీసుకుంటున్న సన్నివేశంలో ఇది ఏ మాత్రం పొసగని ఒక అసందర్భ వ్యవహారం.
(అక్టోబర్ 29 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
అమెరికా తప్ప అన్యథా లేని విధానమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



