దాని విలువ రూ.28,874 కోట్లు
అనిల్ అంబానీ గ్రూప్‌పై కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : కోబ్రాపోస్ట్ అనే దర్యాప్తు జర్నలిజం సంస్థ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అడాగ్ (అనిల్ ధీరూభారు అంబానీ గ్రూప్)పై సంచలన ఆరోపణలు చేసింది. సుమారు రూ.28,874 కోట్ల భారీ బ్యాంక్ మోసానికి పాల్పడినట్టు తెలిపింది. న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోబ్రాపోస్ట్ ఈ ఆరోపణలు చేసింది. కోబ్రాపోస్ట్ నివేదికను ఉటంకిస్తూ దాని సంపాదకుడు అనిరుద్ద బహల్ మొత్తం వ్యవహారాన్ని వివరించారు. దీని ప్రకారం.. అనిల్ అంబానీ గ్రూప్ ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల నుంచి, అలాగే ఐపీఓలు, బాండ్ల ద్వారా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నది.
అయితే ఆ డబ్బును వాస్తవానికి వ్యాపారాల కోసం కాకుండా షెల్ కంపెనీలు (నకిలీవి లేదా కాగితానికి మాత్రమే పరిమితమైన కంపెనీలు), విదేశీ కంపెనీల ద్వారా చుట్టూ తిప్పి.. తిరిగి తమ సొంత కంపెనీలకు పంపింది. ఈ విధంగా వారు బ్యాంకులను, పెట్టుబడిదారులను మోసం చేశారు. ఎన్‌సీఎల్‌టీ డేటా ప్రకారం అడాగ్‌కు చెందిన తొమ్మిది కంపెనీలు రూ.1,78,491 కోట్ల బాకీలను చెల్లించాల్సి ఉన్నది. దీనితో పాటు 2008 నుంచి కంపెనీలకు చెందిన పెట్టుబడిదారుల సొమ్ము రూ.1,59,721 కోట్లు కలుపుకొని మొత్తం రూ.3.38 లక్షల కోట్ల ప్రజాసొమ్ము దుర్వినియోగమైంది. ”ఇది సాధారణ దుర్వినియోగం కాదు. స్పష్టమైన మోసం. అనిల్ అంబానీ కంపెనీలు అప్పులు తీసుకొని, ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా తిరిగి తమ హౌల్డింగ్ కంపెనీలకు మళ్లించారు” అని అనిరుద్ద బహల్ ఆరోపించారు.
మోడీ ప్రభుత్వం నుంచి చర్యలేవి? : ప్రశాంత్ భూషణ్
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, ఆర్థిక నియంత్రణ స్థంలైన సెబీ, ఆర్బీఐ, ఈడీ, సీబీఐలను తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి భారీ మోసాలు జరుగుతుంటే ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు (అనిల్ అంబానీ లాంటి వారు) స్వచ్ఛగా తిరుగుతుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న గుహ తకుర్తా మాట్లాడుతూ..జర్నలిస్టులపై నిందలు వేయడం, బెదిరించడం ఆపాలన్నారు. ఈ విధమైన ఆర్థిక మోసాలపై ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఆరోపణలపై రిలయన్స్ అడాగ్ ఖండన
కాగా రిలయన్స్ అడాగ్ ఈ ఆరోపణలను ఖండించింది. ఇవి దుష్ప్రచారం, నిరాధారం, ఉద్దేశపూర్వకమైనవని వివరించింది. ఈ దర్యాప్తు తమ ప్రత్యర్థి కంపెనీలు నిధులు సమకూర్చి చేయించదనీ, వాటి లక్ష్యం తమ షేర్ల విలువ తగ్గించడమేనని పేర్కొన్నది. ఇప్పటికే ఈ విషయాలను సీబీఐ, ఈడీ, సెబీ వంటి సంస్థలు పరిశీలించాయనీ, పాత సమాచారాన్ని మళ్లీ చూపిస్తున్నారని వివరించింది.
‘రిలయన్స్ అడాగ్’భారీ బ్యాంక్ మోసం
- Advertisement -
- Advertisement -



