Saturday, November 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఏ రాష్ట్రానికి స్థానికులం?

ఏ రాష్ట్రానికి స్థానికులం?

- Advertisement -

ఏపీలో ఇంటర్‌ చదివితే తప్పా? ఇతర రాష్ట్రాల్లో చదవొద్దని ప్రభుత్వం చెప్పలేదు
తెలంగాణ విద్యార్థుల్ని స్థానికేతరుల్ని చేసిన జీవో 33…నీట్‌లో బెస్ట్‌ ర్యాంకు వచ్చినా ప్రయోజనం సున్నా
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను కోల్పోతున్న విద్యార్థులు
2024కు ముందు ఉత్తీర్ణులైన వారికి పాత పద్ధతిలోనే సీట్లివ్వాలని డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌/ఓయూ
‘బీసీ-డీ సామాజిక తరగతికి చెందిన నేను హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో హోలిమేరి ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివాను. టెన్త్‌లో మంచి మార్కులు రావడంతో తక్కువ ఫీజు ఉంటుందని చెప్పడంతో ఏపీలోని తిరుపతిలో నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివాను. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ పాసయ్యాను. మూడు సార్లు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నాను. నీట్‌-2025లో జాతీయ స్థాయిలో 1.94 లక్షల ర్యాంకు వచ్చింది. జాతీయ స్థాయిలో బీసీ-డీ కేటగిరీలో 93 వేలు వచ్చింది. రాష్ట్రంలో లోకల్‌ ర్యాంకు 3,316 వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 33 జీవో ప్రకారం ఏపీలో ఇంటర్‌ చదవడం వల్ల తెలంగాణలో నేను స్థానికేతరులుగా మారిపోయాను. మా తాత, తండ్రి హైదరాబాద్‌కు చెందిన వారే. నేను తెలంగాణ స్థానికురాలిని. నా కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి. సీఎం రేవంత్‌రెడ్డి నాకు న్యాయం చేయాలి.’అంటూ హైదరాబాద్‌కు చెందిన చలపతి కూతురు తనిష్క డిమాండ్‌ చేశారు.

‘మాది మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామం. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు సీతంపేట గ్రామంలో నిర్మల హైస్కూల్‌లో చదివాను. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖమ్మం టౌన్‌ హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాను. ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్య గోశాలలో చదివాను. నేను 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ పాసయ్యాను. రెండు సార్లు నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నాను. నీట్‌-2025లో జాతీయ స్థాయిలో 2.69 లక్షల ర్యాంకు, రాష్ట్రంలో లోకల్‌ ర్యాంకు 5892 ర్యాంకు వచ్చింది. నా కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వస్తున్నాయి. నన్ను స్థానికేతరులుగా గుర్తించడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. టెన్త్‌ వరకు ఇక్కడే చదివిన మేము ఏ రాష్ట్రానికి స్థానికులం అవుతాం’ అని ఎం తేజస్విని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్య ఈ ఇద్దరిది మాత్రమే కాదు. తెలంగాణలో పదో తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్‌ ఆంధ్రప్రదేశ్‌లో చదివిన విద్యార్థులది. తనిష్క 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పాసై ఏపీలో ఇంటర్‌లో చేరింది. ఆ సమయంలో తెలంగాణలో చదవకుంటే స్థానికేతరులుగా మారిపోతారనే హెచ్చరికను నాటి ప్రభుత్వం ఇవ్వలేదు.

అప్పుడు తమకు ఇక్కడ చదవకుంటే స్థానికతను కోల్పోతామనే కనీస అవగాహన లేదు. అందుకే ఏపీలో ఇంటర్‌ చదవాల్సి వచ్చింది. తొమ్మిది నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు తెలంగాణలో చదివేతేనే స్థానికులంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జులై 19న జీవోను జారీ చేసింది. లేకుంటే స్థానికేతరులుగా మారిపోతారని స్పష్టం చేసింది. 2024 కంటే ముందు ఏపీలో ఇంటర్‌ చదవడమే తాము చేసిన తప్పా?అని ప్రభుత్వాన్ని నీట్‌ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి జీవో నెంబర్‌ 33ను వర్తింపజేయాలని కోరుతున్నారు. గతవిద్యాసంవత్సరం కంటే ముందు ఉత్తీర్ణులైన విద్యార్థులకు 2017, జులై ఐదో తేదీన తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోనెంబర్‌ 114ను వర్తింపజేయాలని సూచిస్తున్నారు. ఈ జీవో ప్రకారం ఆరు 12వ తరగతి వరకు నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులవుతారు. 114 జీవోను పరిగణనలోకి తీసుకుని తెలంగాణలో పదో తరగతి వరకు చదివి, ఏపీలో ఇంటర్‌ చదివిన 25 విద్యార్థులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కోరుకొండ, కలికిరిలోని సైనిక పాఠశాలల్లో చదివినా స్థానికేతరులుగా మారిపోతున్నారు.

ఆ విద్యార్థులకు మినహాయింపు
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ శ్రేష్ట పథకం ద్వారా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు వివిధ రాష్ట్రాల్లో ప్రయివేటు గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలను కల్పిస్తున్నది. తెలంగాణ విద్యార్థులు కూడా ఆ పథకం కింద సీట్లు పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో విద్యనభ్యసిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం శ్రేష్ట పథకం ద్వారా వేరే రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులను తెలంగాణ స్థానికులుగానే పరిగణించాలని నిర్ణయించింది. దానివల్ల ఎస్సీ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివినా తెలంగాణలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్లను స్థానికుల కోటా కింద పొందడానికి అర్హులుగా ఉన్నారు. తెలంగాణకు చెందిన అధికారులు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తే వారి పిల్లలు కూడా స్థానికులుగా పరిగణించబడుతున్నారు.

మంత్రులకు విజ్ఞప్తులు..పరిష్కారం శూన్యం
33 జీవో ఈ ఏడాది జులై 19న వచ్చింది. కానీ 25 మంది తెలంగాణ అభ్యర్థులు 2024 కంటే ముందే ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యారు. అయితే 33 జీవో పరిధిలోకి తాము రాబోమని అంటున్నారు. తమకు 33 జీవోను వర్తింపజేయొద్దంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ రామచంద్రనాయక్‌, ఎంపీ బలరాం నాయక్‌, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తును కలిసి వారి సమస్యను వివరించారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. పలుమార్లు కలిసినా సమస్య పరిష్కారం కాలేదు.

సీఎం ఇంటికి వెళ్తే…కేసులు పెడతాం.. బెదిరిస్తున్న పోలీసులు
తమ సమస్య పరిష్కారం కోసం నీట్‌లో ర్యాంకు సాధించి, స్థానికత కోల్పోయిన 25 మంది అభ్యర్థులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు రెండు, మూడు రోజులు వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఇక్కడికి ఇంకోసారి వస్తే కేసులు నమోదు చేస్తామంటూ అభ్యర్థులను బెదిరించారు. దీంతో ఎవరిని కలవాలో, ఎవరిని కలిస్తే
న్యాయం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పోతూ ఇంకోవైపు న్యాయం జరగకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఉత్తర్వులు మార్చే అధికారం రాష్ట్రానిదే – కోర్టు తీర్పు
తమను తెలంగాణ స్థానికులుగా గుర్తించాలని కోరుతూ సదరు విద్యార్థులు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. అయితే జీవో 33ను సవరించుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనీ, సమస్యను అక్కడే పరిష్కారం చేసుకోవాలని కోర్టు సూచించింది. దీనితో ఆ విద్యార్థులు పలువురు మంత్రులు, అధికారుల్ని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -