Saturday, November 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅజహరుద్దీన్‌ అనే నేను..

అజహరుద్దీన్‌ అనే నేను..

- Advertisement -

రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్‌
హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, మాజీ లోక్‌సభ సభ్యులు మహ్మద్‌ అజహరుద్దీన్‌ (62) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో అజహరుద్దీన్‌తో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా పలు వురు నాయకులు, అజహరుద్దీన్‌ కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

ధన్యవాదాలు
‘మంత్రివర్గంలోకి తీసుకుని, బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడే అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానికి, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు. జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికకు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధం లేదు’ అని ప్రమాణ స్వీకారం అనంతరం అజహరుద్దీన్‌ మీడియాకు చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారనీ, తన దేశభక్తి నిరూపణకు తనకు ఎవరి సర్టిఫికెట్‌కు అవసరం లేదని స్పష్టం చేశారు.

విమర్శలు వచ్చినా..
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా మంత్రివర్గంలో మైనారిటీలకు భాగస్వామ్యం లేదని ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహ్మద్‌ అజహరుద్దీన్‌కు రాష్ట్ర క్యాబినెట్‌లో స్థానం దక్కింది. ఓ వైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు జరుగుతుండగా, మంత్రివర్గ విస్తరణ పలు విమర్శలకు కారణమైంది. జూబ్లీహిల్స్‌లో సుమారు 20 శాతం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అజహరుద్దీన్‌ ఇక్కడి నుంచి పోటీ చేసి 35.03 శాతం ఓట్లు సాధించి, రెండో స్థానంలో నిలిచారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్‌ రానున్న 9 రోజులు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవటంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

శాఖ కేటాయింపుపై చర్చ
నూతనంగా రాష్ట్ర మంత్రివర్గంలోకి వచ్చిన అజహరుద్దీన్‌కు శాఖ కేటాయింపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన 2018 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాహుల్‌గాంధీతో అజహరుద్దీన్‌కు స్నేహ బంధం ఉంది. ప్రస్తుతం సీఎం పరిధిలో ఉన్న పురపాలక, విద్య, హోం శాఖల్లో దేన్ని కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. మైనారిటీ సంక్షేమ శాఖను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ నిర్వహిస్తున్నారు.

ఇదీ ప్రస్థానం
భారత క్రికెట్‌ చరిత్రలో మహ్మద్‌ అజహరుద్దీన్‌కు ప్రాధాన్యత ఉంది. 1963లో జన్మించిన ఆయన ఉన్నత విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 21 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తొలి మూడు టెస్టుల్లో శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. అనంతరం భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -