Saturday, November 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు

అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు

- Advertisement -

– భారతీయులపై ట్రంప్‌ ప్రభుత్వం మండిపాటు
– హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై ఆగ్రహం
– ముమ్మర తనిఖీలకు నిర్ణయం
వాషింగ్టన్‌ :
దేశంలోని కంపెనీలు హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా కార్మిక శాఖ ఆరోపించింది. విదేశీ కార్మికులు… ముఖ్యంగా భారతీయులు అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ నిందించింది. విదేశీ ఉద్యోగుల స్థానంలో యువ అమెరికన్లను తీసుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు కార్మిక శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వీడియో ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘హెచ్‌-1బీ వీసాలను దుర్వినియోగం చేస్తూ విదేశీయుల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దీంతో యువ అమెరికన్ల కలలు కల్లలవుతున్నాయి’ అని ఆ ప్రకటనలో తెలిపింది. ఈ దుర్వినియోగానికి కంపెనీలను బాధ్యులను చేసి, అమెరికా ప్రజల కలలను సాకారం చేస్తున్నామని చెప్పింది.
హెచ్‌-1బీ వీసాల నియమ నిబంధనలను సరిగా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అమెరికా కార్మిక శాఖ గత నెలలో ‘ప్రాజెక్ట్‌ ఫైర్‌వాల్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికా ఉద్యోగుల స్థానంలో టెక్‌, ఇంజినీరింగ్‌ పోస్టుల్లో పనిచేసేందుకు తక్కువ జీతంతో లభించే విదేశీ నిపుణులను నియమించుకోకుండా కంపెనీలను అడ్డుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి కొనసాగింపుగానే తాజా ప్రకటన జారీ అయింది. హెచ్‌-1బీ వీసా అనుమతుల్లో 72 శాతం భారతీయులే సొంతం చేసుకుంటున్నారని కార్మిక శాఖ తెలిపింది. దీనిని నివారించి అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, కార్మిక మంత్రి లోరీ ఛావెజ్‌-డెరెమర్‌ నిర్ణయించారని కొనియాడింది. ‘కష్టపడి పనిచేస్తే అమెరికా కలలు నెరవేరతాయని మేము అనేక తరాలుగా ప్రజలకు చెబుతున్నాం. అయితే చాలా మంది యువ అమెరికన్ల కలలు కల్లలయ్యాయి’ అని చెప్పు కొచ్చింది. హెచ్‌-1బీ వీసాలను దుర్వినియోగం చేయడానికి రాజకీయ నాయకులు, అధికారులు కంపెనీలకు అవకాశం కల్పించారని, దీంతో అవి ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేశాయని ఆరోపించింది. అయితే ఇప్పుడు ట్రంప్‌ వారికి ఓ కొత్త అవకాశాన్ని అందిస్తున్నారని తెలిపింది. నియామక ప్రక్రియలో అమెరికన్లకే కంపెనీలు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ తెలియజేసింది. ట్రంప్‌ జాబ్‌ అజెండా అయిన ‘అమెరికా ఫస్ట్‌’ను ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కార్మిక శాఖ వీడియో ప్రకటన అద్దం పడుతోంది. జీతాల్లో కోత విధించేందుకు, అమెరికా ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు హెచ్‌-1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్న కంపెనీల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని ప్రాజెక్ట్‌ ‘ఫైర్‌వాల్‌’ నిర్దేశిస్తోందని అధికారులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -