Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి

శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి

- Advertisement -

– ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలి
– కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలి: సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కులదురహంకార హత్యకు గురైన నిండు గర్భిణి తలండి శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి ఆయన శుక్రవారం లేఖ రాశారు. కొమురం భీం జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి శ్రావణి (21) అదే గ్రామం బీసీ కులానికి చెందిన శివార్ల శేఖర్‌ గతేడాది అక్టోబర్‌ 10న బెల్లంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. శేఖర్‌ తండ్రి శివార్ల సత్తయ్య ఆయన కుటుంబ సభ్యులు ఈ కులాంతర వివాహాన్ని అంగీకరించలేదని పేర్కొన్నారు. దీంతో ఈ జంట శ్రావణి తండ్రి చెన్నయ్య ఇంట్లోనే కాపురం ఉన్నారని వివరించారు. గతనెల 18న ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావణి మామ శివార్ల సత్తయ్య ఆయన కుటుంబ సభ్యుల (శివార్ల కుమార్‌, శివార్ల కవిత)తో కలిసి తొమ్మిది నెలల నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె కడుపులో, మర్మాంగంలో కత్తితో పొడిచాడని తెలిపారు. ప్రాణభయంతో పరుగెత్తిన శ్రావణిని వెంటాడి గొడ్డలితో తల నరికి నడి వీధిలో హత్య చేశాడని పేర్కొన్నారు. బిడ్డకు జన్మనివ్వకూడదనే తలంపుతోనే ఈ కుల దురహంకార హత్యకు ఆయన పాల్పడ్డారని విమర్శించారు. ఈ ఘటనలో శ్రావణి భర్త శేఖర్‌తో సహా హత్యకు పథకం పన్ని ఆమె తల్లిదండ్రులను ఉదయాన్నే పొలం పనుల పేరుతో బలవంతంగా వాహనంలో తీసుకెళ్లాడని తెలిపారు. ఈ కుల దురహంకార హత్య జరిగి 14 రోజులు గడుస్తున్నా ఆ జిల్లా కలెక్టర్‌గానీ, ఎస్పీగానీ ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న తనతోపాటు తమ పార్టీ ప్రతినిధి బృందంతో వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించామని గుర్తు చేశారు. శ్రావణిది ఇల్లు, భూమి లేని నిరుపేద కుటుంబమని తెలిపారు.

ఈ ఘటనపై విచారణ జరిపించి, శ్రావణి మామ శివార్ల సత్తయ్య, భర్త శివార్ల శేఖర్‌, కుటుంబ సభ్యులైన శివార్ల కుమార్‌, శివార్ల కవితలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం తల్లీబిడ్డలను హత్య చేసిన కేసు నమోదు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి ఆర్నెల్లలో వారిని శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో, ఐదెకరాల భూమితోపాటు, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 140కిపైగా కుల దురహంకార హత్యలు జరిగాయని తెలిపారు. ఇవి ఇంకా కొనసాగే ప్రమాదకర పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. కావున ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వమే అవగాహన సదస్సులు నిర్వహించాలనీ, కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -