Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంకదలికలను గుర్తించే స్మార్ట్‌ఫోన్‌

కదలికలను గుర్తించే స్మార్ట్‌ఫోన్‌

- Advertisement -

జీపీఎస్‌ డేటాతో పని చేసే ‘ఆండ్రోకాన్‌’
ఐఐటీ-ఢిల్లీ నూతన పరిశోధనొ గోప్యతపై కొత్త ఆందోళనలు
న్యూఢిల్లీ :
ఒక్క స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టు. అయితే అదే స్మార్ట్‌ఫోన్‌ మనల్ని నిరంతరమూ పర్యవేక్షించగలదు. అందులోని జీపీఎస్‌ సిస్టమ్‌ మన లొకేషన్‌ను మాత్రమే కాకుండా.. మన కదలికలనూ గుర్తించగలదు. చుట్టుపక్కల పరిస్థితులనూ అంచనా వేయగలదు. ఐఐటీ-ఢిల్లీ నూతన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. ఎం.టెక్‌ విద్యార్థి సోహం నాగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ స్మృతి ఆర్‌. సారంగిల అధ్యయనం దీనిని తెలియజేసింది. ఈ మేరకు జీపీఎస్‌ డేటా ఆధారంగా పని చేసే ‘ఆండ్రోకాన్‌’ అనే కొత్త వ్యవస్థను వారు పరిచయం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం.. సాధారణంగా మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లలో జీపీఎస్‌ చిప్‌ (లొకేషన్‌ సిస్టమ్‌) ఉంటుంది. ఇది మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి ఎలా వెళ్లాలి వంటి ‘లొకేషన్‌’ వివరాలను గుర్తించగలదు. అయితే ఇది మన లొకేషన్‌ను గుర్తించడానికి మాత్రమే పరిమితం కాదనీ, దీని ద్వారా మన శరీర చలనాలు, పరిసర వాతావరణం కూడా తెలుసుకోవచ్చని తాజా అధ్యయనం చెప్తున్నది. ఇందుకు వీరు రూపొందించిన కొత్త వ్యవస్థ పేరే ‘ఆండ్రోకాన్‌’. జీపీఎస్‌ డేటా నుంచి అందే సమాచారం ద్వారా ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఇది మనం కూర్చున్నామా, నడుస్తున్నామా, పడుకున్నామా, విమానంలో ఉన్నామా, మెట్రోలో ప్రయాణిస్తున్నామా అనే వివరాలను గుర్తించగలదు. అంతేకాదు.. మనం లోపల ఉన్నామా(ఇండోర్స్‌), బయట ఉన్నామా(ఔట్‌డోర్స్‌), మనం ఉన్న ప్రాంతం జనంతో నిండిందా లేదా ఖాళీగా ఉందా అనే సమాచారాన్ని కూడా తెలుసుకోగలదు. ఈ వ్యవస్థలో ఏ కెమెరా, మైక్రోఫోన్‌, మోషన్‌ సెన్సర్ల వినియోగమూ ఉండదు. ఇది జీపీఎస్‌ డేటాలో ఉన్న 9 పారామీటర్స్‌ను విశ్లేషించి ఈ వివరాలను పొందుతుంది. అయితే ఈ తాజా పరిశోధన కొత్త ఆందోళనలకు దారి తీస్తున్నది. ఇలాంటి వ్యవస్థతో గొప్యతకు భంగం వాటిలే ప్రమాదం ఉంటుందని సామాజికవేత్తలు, టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే పలు యాప్‌లు యూజర్ల లొకేషన్‌ను తెలుసుకోవడానికి వారి నుంచి అనుమతులు కోరతాయి. అలాంటి సందర్భాల్లో సదరు యాప్‌లు ఒక వ్యక్తి గోప్యతను ఉల్లంఘించే ప్రమాదాలు లేకపోలేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -