Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజు బకాయిల విడుదల కోసం నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త ఉద్యమం

ఫీజు బకాయిల విడుదల కోసం నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త ఉద్యమం

- Advertisement -

మొదటిరోజు విద్యార్థుల బిక్షాటన
3న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు వినతి
4న మంత్రుల నివాసం ముట్టడి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిల విడుదల కోసం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. ఫీజు బకాయిలు విడుదలయ్యే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమీ ఇచ్చినట్టు ఫీజు బకాయిల్లో రూ.900 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం ఈనెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను రూపొందించామని చెప్పారు.

మొదటిరోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు బిక్షాటన చేస్తారని అన్నారు. రెండోరోజు ఆదివారం వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమాలుంటాయనీ, గాడిదలకు వినతిపత్రాలను సమర్పించడం, ఫీజులివ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ విద్యార్థులు ఉరేసుకోవడానికి ప్రయత్నించడం వంటిని చేపడతామని వివరించారు. మూడోరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేస్తామని అన్నారు. చివరి రోజు మంగళవారం హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో మంత్రుల నివాసాల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టడం సరైంది కాదన్నారు. ఫీజు బకాయిలను చెల్లించి తనిఖీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈనెల మూడు నుంచి యాజామన్యాలు చేపట్టే విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇంకోవైపు ప్రభుత్వం ఫీజులివ్వడం లేదనే కారణంతో విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేసే విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధ్రువపత్రాలు ఇచ్చేలా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.10,300 కోట్లున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యామంత్రిగా ఉన్నా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫీజు బకాయిలు ఉండడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు విడుదల చేయకుంటే వారు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఫీజు బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి కిరణ్‌, అశోక్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్‌ ప్రభుత్వ బిక్ష కాదనీ, రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. విద్యార్థులకు సకాలంలో ఫీజులను చెల్లించకుండా రోడ్డెక్కే పరిస్థితికి ప్రభుత్వం తెచ్చిందన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం బకాయిలు, డైట్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీలను విడుదల చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల హాస్టల్‌ బకాయిలను విడుదలచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే భవిష్యత్‌లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్‌, లెనిన్‌ గువేరా, నాయకులు రజినీకాంత్‌, ప్రవీణ్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -