కీలక పారిశ్రామిక కారిడార్‌గా ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్
మేక్ ఇన్ సౌత్, స్కేల్ ఫర్ ది వరల్డ్ కోసం కలిసి పనిచేద్దాం : సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ‘జీడీపీ’ అంటే కేవలం ‘గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్’ కాదనీ, గ్రాస్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పీపుల్ (జీఈపీ) అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భారత్ ’15’ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే ప్రయాణంలో ‘తెలంగాణ’ను కీలక భాగస్వామిగా మార్చుతామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట్ లో ఐటీసీ కాకతీయలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో ‘డ్రైవింగ్ ఇండిస్టియల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ తెలంగాణ రోడ్ మ్యాప్ టూ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ’ అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు.
‘అర్బన్ ఇంజిన్’, ‘ఇండిస్టియల్ హార్ట్ ల్యాండ్’, ‘రూరల్ ట్రాన్స్ ఫర్మేషన్ జోన్’ అనే మూడు మూల స్థంభాలుగా తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇందుకోసం అమలులో వేగం, అవకాశాలలో పార దర్శకత, రూపకల్పనలో ‘ఫ్యూచర్-రెడీ’గా ఉండే కొత్త అభివృద్ధి నమూనాకు ‘రోడ్‌మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామని వివరించారు. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 350 బిలియన్ డాలర్లకు చేరేలా సర్వీసెస్, సస్టైనబిలిటీ, స్మార్ట్ లివింగ్‌కు గ్లోబల్ క్యాపిటల్, నెట్-జీరో ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతాన్ని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి రైతునూ పారిశ్రా మికవేత్తగా మార్చేలా అగ్రి-ప్రాసెసింగ్ క్లస్టర్లు, డిజిటల్-అనుసంధానం కలిగిన ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ, ఇమేజ్ టవర్స్, టీ-హబ్ ఫేజ్-2 ద్వారా రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత పటిష్ఠమవుతుందని అన్నారు. రాష్ట్రంలో 2030 నాటికి ’20 గిగావాట్స్’ పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వాటితో పోటీపడేలా ‘మేక్-ఇన్-సౌత్, స్కేల్-ఫర్-ది-వరల్డ్’ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘విశ్వసనీయమైన లాంచ్ ప్యాడ్’గా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఏపీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ చైర్మెన్ థామస్ జాన్ ముత్తూట్, డిప్యూటీ చైర్మెన్ రవి చంద్రన్, సీఐఐ తెలంగాణ కౌన్సిల్ చైర్మెన్ శివప్రసాద్ రెడ్డి, వైస్ చైర్మెన్ గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తుపాను బాధితులను ఆదుకోండి : పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు
మొంథా తుపానుతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించాల్సిందిగా పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పౌరులు, రైతుల కోసం సహాయ, పునరావాస శిబిరాలు నిర్వహించాలని పలు సంస్థలకు ఆయన శుక్రవారం లేఖలు రాశారు. సామాజిక బాధ్యతగా నిత్యావసర వస్తువులు, ఔషధాలు, వైద్య సహాయం అందించాని కోరారు. ఆపత్కాలంలో వారికి అండగా నిలిచి చితికిన కుటుంబాలను తిరిగి నిలబెట్టాలని తెలిపారు. పొలాల్లోని పంటలు వరదలకు దెబ్బతిన్నాయనీ, మార్కెట్లకు తరలించిన ధాన్యం, మక్కలు వాన నీటిలో తడిసాయని వెల్లడించారు. ప్రభుత్వం అందించే సాయంతోపాటు ప్రయివేటు సంస్థలు కూడా తమ వంతు సహకారం అందిస్తే అకాల వర్షాలతో నష్టపోయినవారు త్వరగా కోలుకుంటారని పేర్కొన్నారు.



