Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ తీర్పు..ఆ పార్టీకి చెంప పెట్టు కావాలి

జూబ్లీహిల్స్‌ తీర్పు..ఆ పార్టీకి చెంప పెట్టు కావాలి

- Advertisement -

కాంగ్రెసోళ్లు దేశ ముదుర్లు : కేటీఆర్‌
షేక్‌పేట్‌లో రోడ్డు షో


నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
కాంగ్రెసోళ్లు దేశ ముదుర్లని, జూబ్లీహిల్స్‌ ప్రజలు ఇచ్చే సమాధానం ఆ పార్టీకి చెంపపెట్టులా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం షేక్‌పేట్‌ డివిజన్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రసంగించారు. ”కొడుతున్నామా మళ్లీ జూబ్లీహిల్స్‌?” అంటూ ప్రారంభించిన కేటీఆర్‌.. ప్రజల ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా అని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పెద్దలా వ్యవహరించి పదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోనే మూడున్నర వేల మందికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదని, ఒక ఇల్లూ కట్టలేదని విమర్శించారు.

హైడ్రా పేరు మీద బస్తీల్లోకి బుల్డోజర్లను పంపుతున్నారన్నారు. కాంగ్రెస్‌ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. నాలుగు వేల బడ్జెట్‌ అని మైనార్టీలను మోసం చేసిందని, మైనార్టీ సబ్‌ప్లాన్‌ అంటూ మరో మోసానికి తెరతీసిందని చెప్పారు. ఇప్పుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవంటూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అభివృద్ధి ఒక వైపు, కాంగ్రెస్‌ రెండేండ్ల నిర్లక్ష్యం మరో వైపు.. ప్రజలు ఆలోచించి ఓటేయాలి అని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో గట్టి తీర్పు ఇచ్చి కాంగ్రెస్‌ డిపాజిట్‌ జప్తు చేస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ఓ కుటుంబం అని గోపీనాథ్‌ చెప్పేవారని, మహిళలకు అండగా ఉంటూ సమస్యలు పరిష్కరించేవారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -