సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
హత్యా రాజకీయాలు చేసేవారికి ప్రజలు సమాధి కడతారు : సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కేసును నీరుగార్చొద్దు : సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సామినేని సంతాపసభలో వక్తలు పలువురి నివాళి
అంతిమయాత్రలో కార్యకర్తలు.. అంత్యక్రియలు పూర్తి
నవతెలంగాణ – బోనకల్
మచ్చలేని మహౌన్నతమైన వ్యక్తి సామినేని రామారావు అని, ఆయనను కాంగ్రెస్ గూండాలు అతి దారుణంగా హత్య చేశారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు భౌతికకాయానికి శుక్రవారం తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పార్టీ జెండా కప్పి నివాళి అర్పించారు. అనంతరం ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం. సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జూలకంటి రంగారెడ్డి, టి. సాగర్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు రామారావు భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు.
అనంతరం సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. గ్రామంలో సీపీఐ(ఎం) బలహీనంగా ఉన్న సమయంలో రామారావు బలమైన పార్టీగా తీర్చిదిద్దారన్నారు. ఆయన మృతి రాష్ట్రానికే తీవ్ర నష్టమని తెలిపారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు నాయకులను హత్య చేయడం ద్వారా ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నాలు చేసిన మహానుభావులు మట్టిలో కలిసిపోయారని అన్నారు. దేశానికి కమ్యూనిజమే మార్గం తప్ప మరొకటి కాదన్నారు.
హత్యా రాజకీయాలు చేసేవారు అరణ్యవాసం చేయక తప్పదు : సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
హత్యా రాజకీయాలు చేసేవారు భవిష్యత్తులో అరణ్యవాసం చేయక తప్పదని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. సామినేని రామారావుని కాంగ్రెస్ గూండాలు హత్య చేయడం దారుణమన్నారు. ఇలాంటి రాజకీయాలు చేసేవారికి ప్రజలు సమాధి కడతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాతర్లపాడులో ఘోరంగా ఓడిపోతామని నిర్ధారణ కావడంతోనే హత్య చేశారని తెలిపారు. డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క.. రామారావు హత్యను ఖండిస్తూ ప్రకటన చేయటం కాదు, హంతకులను పట్టించాలని డిమాండ్ చేశారు.
హత్య చేసిన వారిని అరెస్టు చేయాలి : సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రామారావును హత్యచేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి లొంగి కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఆ హంతకులను తాము పట్టుకుంటామని ఆయన హెచ్చరించారు. సామినేని రామారావు హత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా హత్యా రాజకీయాలు మానుకోవాలని అన్నారు. తమ పార్టీకి ప్రాణాలు ఇవ్వడం కొత్తేమీ కాదని, ఇది చేతకానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
పేద, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పని చేశారు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
పేద బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన మహానాయకుడు సామినేని రామారావు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. దశాబ్దాల క్రితమే రామారావును హత్య చేయాలని ప్రయత్నం చేశారని, కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. రాష్ట్ర కేంద్రం నుంచి తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పాతర్లపాడు గ్రామం వచ్చారన్నారు. గుండాలు, రౌడీలతో నియోజకవర్గంలో పరిపాలన చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఆ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు డీజీ నర్సింహారావు, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య, దడాల సుబ్బారావు, తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి. ప్రసాద్, బాబురావు, బండి రమేష్, విక్రం, బుగ్గవీటి సరళ, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ జిల్లాల కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, మల్లు నాగార్జున రెడ్డి, కనకారెడ్డి, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, షేక్ జబ్బార్, పొన్నం వెంకటేశ్వరరావు, బండి పద్మ, జడ్పీ మాజీ చైర్మెన్ లింగాల కమల్ రాజు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళి అర్పించారు. సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు సంతాపం తెలిపారు.
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
పాతర్లపాడులో నిర్వహించిన సంతాపసభ అనంతరం ప్రజల సందర్శనార్థం రామారావు భౌతికకాయాన్ని ఖమ్మం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో కొద్దిసేపు ఉంచారు. అక్కడనుంచి గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. దీనికి ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం గ్రామ శివారులో రామారావు కుమారుడు విజయ్ దహనసంస్కారాలు నిర్వహించారు.



